iDreamPost

మరోసారి దేశ యాత్రకు సిద్ధమవుతున్న బాబు..!

మరోసారి దేశ యాత్రకు సిద్ధమవుతున్న బాబు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి దేశ యాత్రకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఆయన యాత్ర చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తోందనే విషయాన్ని ప్రొజెక్ట్‌ చేస్తూ అన్ని పార్టీల నేతలను తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారని మాజీ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. ఈ రోజు అనంతపురంలో జేసీ కుంటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ ఈ మేరకు వెల్లడించారు.

తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్న విషయంపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని కూడా లోకేష్‌ చెప్పారు. అన్ని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకువెళ్లి వైసీపీ అరాచకాలపై చైతన్యవంతులను చేస్తామని చెప్పడంతో చంద్రబాబు మరోసారి దేశ వ్యాప్త యాత్ర ఖరారైనట్లుగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కోవిడ్‌ నిబంధనలు ఉన్న నేపథ్యంలో అవి ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తామని నారా లోకేష్‌ స్వయంగా భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటించారు.

లోకేష్‌ చెప్పినట్లు చంద్రబాబు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకు వెళితే.. రెండేళ్లలో రెండోసారి ఆయా పార్టీల అధినేతల వద్దకు ఆయన వెళ్లినట్లువుతుంది. 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో దేశంలోని పలు పార్టీల నేతల వద్దకు వెళ్లారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్దకు వస్తానని మరీ అడిగి వెళ్లారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడదాం అంటూ ఆయన యాత్ర సాగించారు. చేతినిండా శాలువాలు, తిరుపతి లడ్డూలతో వెళ్లి వారిని కలిసి వచ్చేవారు. కుదిరితే వారితో కలసి మీడియా సమావేశం నిర్వహించేవారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్, బీఎస్పీ అధినేత మాయావతి.. ఇలా మోడీ రాజకీయ ప్రత్యర్థులను కలిసేందుకు ఆసక్తి చూపారు.

పైకి మోడీపై పోరాటం అని చెప్పిన చంద్రబాబు.. తనపై కేసులు, అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ అపట్లో ప్రచారం సాగింది. ఆ ప్రచారానిక బలం చేకూరేలా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.. బహిరంగసభల్లో ‘నా భవిష్యత్‌ మీ బాధ్యత’ అంటూ ప్రజలను వేడుకున్నారు. నన్ను అరెస్ట్‌ చేస్తే మీరందరూ కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఓటుకునోటు కేసులో విచారణ సాగుతోంది. ఇక అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణం, నిధుల దుర్వినియోగం తదితర అక్రమాలపై తనను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయొచ్చనే సమాచారంతో చంద్రబాబు ఇలా బహిరంగంగా తన భయాన్ని వెల్లడించారు. ఈ ఆపద నుంచి బయటపడేందుకు చంద్రబాబు అప్పట్లో వివిధ పార్టీల నేతలను కలిశారనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.

ఇప్పుడు అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే చంద్రబాబు మరోసారి దేశ వ్యాప్త యాత్రకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి అక్రమాలు, కుంభకోణాల నేపథ్యంలో టీడీపీ తాజా, మాజీ ప్రజాప్రతినిధుల ఒక్కొక్కరుగా అరెస్ట్‌ అవుతున్నారు. టీడీపీ హాయంలో చేసిన ప్రతి కుంభకోణాన్ని, అవినీతికి మూల్యం చెల్లించుకోకతప్పదని ఓ పక్క వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కులాలను అడ్డుపెట్టుకుని బయటపడలేరంటూ స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అండ్‌ టీం కూడా తమ నేతలు కుంభకోణాలకు పాల్పడలేదని, అక్రమాలు, అవినీతి చేయలేదని చెప్పకుండా.. వైసీపీ కక్షసాధింపుకు పాల్పడుతోందని మాత్రమే చెబుతున్నారు.

అమరావతి భూ కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్‌ అయ్యారు. రాబోయే రోజుల్లో అరెస్ట్‌ల పర్వం మరింతగా సాగే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. మరో వైపు విశాఖ భూ కుంభకోణంలో కూడా సిట్‌ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయింది. తాజాగా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, క్రిస్మస్‌ కానుక, ఏపీ ఫైబర్‌ నెట్‌ పథకాలపై సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. రేపో, మాపో సీబీఐ రంగంలోకి దిగనుంది. వీటి నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు మళ్లీ దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతల చుట్టూ తిరగడం ఖాయమైంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఆయా పార్టీల అధినేతలను కలిసేందుకు సానుకూల పరిస్థితులు ఉంటాయా..? లేవా..? అనేది ప్రస్తుతం టీడీపీ శ్రేణుల ముందున్న ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి