iDreamPost

నల్ల మల్లారెడ్డి మంచి మనసు.. కోట్లు విలువ చేసే భూమిని వారికి ఉచితంగా!

  • Published Jul 13, 2023 | 8:30 AMUpdated Jul 13, 2023 | 8:30 AM
  • Published Jul 13, 2023 | 8:30 AMUpdated Jul 13, 2023 | 8:30 AM
నల్ల మల్లారెడ్డి మంచి మనసు.. కోట్లు విలువ చేసే భూమిని వారికి ఉచితంగా!

మహేష్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా.. మనం మాత్రం బాగా డబ్బు సంపాదించి.. ఐశ్వర్యవంతులం అయితే చాలదు.. ఆ సంపదలో కొంత భాగం మన ఎదిగి వచ్చిన సమాజానికి ఇవ్వాలి.. లేకపోతే లావయిపోతాం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక చాలా మంది మూవీలో చూపించినట్లు.. కొన్ని ప్రాంతాలను తీసుకుని.. వాటిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇక గుజరాత్‌లో అప్పుడప్పుడు పలు కంపెనీల యజమానులు తమ సిబ్బందికి కార్లు, ఇళ్లు వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చి.. మంచి మనసు చాటుకుంటారు. మన దగ్గర మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి సీన్‌ చూడలేదు. కానీ తాజాగా తెలంగాణలో ఈ తరహా సంఘటన దర్శనమిచ్చింది. తన దగ్గర పని చేసే సిబ్బందికి కోట్ల రూపాయల విలువైన భూమని ఉచితంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు ఓ వ్యాపారవేత్త. ఆ వివరాలు..

ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్‌ నల్ల మల్లారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. ఏళ్లుగా తన దగ్గర నమ్మకంగా పని చేస్తోన్న సిబ్బందికి.. ఏకంగా 12 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్లాట్లు చేసి వారికి ఉచితంగా అందించారు. తన కుమార్తె దివ్య పుట్టిన రోజు సందర్భంగా అనగా జూలై 11న ఈ మంచి పని చేశారు. కుమార్తె బర్త్‌డే రోజున ఆమె చేతులు మీదుగా ఈ భూమికి సంబంధించిన పట్టాలను సిబ్బందికి అందజేశారు. తన దగ్గర ఏళ్ల తరబడి వివిధ హోదాల్లో పని చేస్తోన్న సిబ్బందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. 30 ఏళ్లుగా తన వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తోన్న వ్యక్తితో పాటు.. కూలీల నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉన్నత హోదాలో పని చేస్తోన్న సుమారు 80 మందికి.. ఒక్కొక్కరికి 120-250 గజాల విస్తీర్ణం కలిగిన 12 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరన్నర భూమిని ప్లాట్లుగా చేసి అందించారు నల్ల మల్లారెడ్డి.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసింగారం పంచాయతీ పరిధిలో ఈ ఎకరంన్నర భూమి ఉంది. ఈ భూమిని ప్లాట్లుగా విభజించి ఇళ్ల స్థలాలుగా మార్చి.. తన సిబ్బంది పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా నల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా విద్యాసంస్థలకు ఒక లక్ష్యం, విధానం ఉంది. దానిలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తున్నాం. పిల్లలకు బ్యాలం నుంచే గట్టి పునాది వేయడానికి అక్షరాభ్యాస్‌ తీసుకువచ్చాం. నేడు నాణ్యమైన విద్య అనేది అందని ద్రాక్ష అయ్యింది. డిగ్రీలు చదివిన వారికి కూడా విషయ పరిజ్ఞానం ఉండటం లేదు. మా విద్యా సంస్థలో చదివే విద్యార్థుల జీవితాలు అలా కాకుండా చూసుకునేందుకు కృషి చేస్తున్నాం. మా దగ్గర అంకితభావంతో పని చేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతోంది. అందుకే వారి పని తీరుని గుర్తించి.. వారి సొంతింటి కల నెరవేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. నల్ల మల్లారెడ్డి చేసిన పనిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి