iDreamPost

మైత్రి మాస్టర్ ప్లాన్.. సంక్రాంతికి చిరు, బాలయ్య పోరు లేనట్లే!

మైత్రి మాస్టర్ ప్లాన్.. సంక్రాంతికి చిరు, బాలయ్య పోరు లేనట్లే!

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగితే వచ్చే కిక్కే వేరు. అప్పట్లో వాళ్ళ సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే.. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేది. ఇప్పటికే వాళ్ళు ఎన్నో సార్లు తలపడగా.. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలకృష్ణ పైచేయి సాధించారు. ఇప్పటికీ వాళ్ళ బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులకు కిక్ ఇస్తూనే ఉంది. ఈ సంక్రాంతికి ఒక్క రోజు తేడాతో వాళ్ళు నటించిన సినిమాలు విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సంక్రాంతి పోరు బాక్సాఫీస్ విన్నర్ నువ్వా నేనా అన్నట్టుగా కాకుండా.. ఇరు చిత్రాలతో ప్రేక్షకులను అలరించి నువ్వు, నేను కలిసి విజేతలుగా నిలుద్దాం అన్నట్టుగా సాగనుందని అంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12న విడుదల కానుండగా.. కొల్లి బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కరోజు తేడాతో విడుదలవుతున్న ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. మరోవైపు ఒకే బ్యానర్ నుంచి ఇద్దరు పెద్ద హీరోలు నటించిన సినిమాలను ఒకేసారి విడుదల చేయాలనుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఏదో ఒక సినిమా తీవ్రంగా నష్టపోవడం ఖాయమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అందుకేనేమో ఈ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మైత్రి తెలివిగా వ్యవహరిస్తోంది.

సాంగ్స్ విషయంలో ఒక చిత్రంలోని పాట తర్వాత మరో చిత్రంలోని పాటని విడుదల చేస్తూ.. రెండింటికీ సమ న్యాయం చేస్తోంది మైత్రి. సాంగ్స్ పరంగా మా హీరో సాంగ్ గొప్పంటే, మా హీరోది గొప్ప అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో వార్ కి దిగుతున్నప్పటికీ.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టి, తమ బ్యానర్ నుంచి వస్తున్న రెండు సంక్రాంతి సినిమాలను ఆదరించేలా అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. జనవరి 6న వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్, జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మైత్రి సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్లతోనే ఇరు హీరోల ఫ్యాన్స్ ను కలిపేలా మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. వీర సింహా రెడ్డి ఈవెంట్ కి గెస్ట్ గా చిరంజీవిని, వాల్తేరు వీరయ్య ఈవెంట్ గెస్ట్ గా బాలకృష్ణను తీసుకురాబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే సంక్రాంతి సమరం కాస్తా సంక్రాంతి స్నేహంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి