iDreamPost

అర్నాబ్ మీద దాడి కేసులో నిందితుల అరెస్ట్

అర్నాబ్ మీద దాడి కేసులో నిందితుల అరెస్ట్

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై బుధవారం రాత్రి జరిగిన దాడి కేసులో ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు.ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్ 341, 504 కింద కేసు నమోదు చేసినట్లు ముంబై డీసీపీ అవినాష్ కుమార్ తెలిపారు.ముంబై వర్లీలోని రిపబ్లిక్ టీవీ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఇద్దరూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారని అర్నాబ్ ఎన్ఎంజోషి మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై దుండగులు చేసిన దాడి ఘటనను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. అర్నాబ్ పై దాడి ఘటన ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా మంత్రి అభివర్ణించారు. అర్నాబ్ దంపతులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.అయితే ఈ దాడి ఘటనలో అరెస్టు కాబడ్డ నిందితుల రాజకీయ నేపథ్యం తెలియాల్సి ఉంది. నిందితుల వివరాలు కూడా పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.

అయితే తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్‌ యూత్‌ నాయకులేనని అర్నాబ్‌ ఆరోపించారు.బైక్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తన ప్రాణాలకు హాని జరిగితే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బిజెపి,కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి