iDreamPost

ప్రోటోకాల్ పంచాయితీ… రేవంత్ అరెస్టు

ప్రోటోకాల్ పంచాయితీ… రేవంత్ అరెస్టు

తెలంగాణలో మరోమారు ప్రోటోకాల్ వివాదం తెరమీదికికొచ్చింది. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీర్ పాల్గొన్నారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికార పార్టీ తీరును తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు.

వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తపేటలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రకటించిన సమయం కంటే ముందే వాటర్ ట్యాంకు ప్రారంభించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం ఉండగా, అంతకు ముందే మంత్రి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయరంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆలస్యంగా అక్కడకు చేరుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ఈ విషయంలో నిలదీశారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమయం కంటే ముందే ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఫ్లెక్సీలను చింపేశారు.

కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు రేవంత్ రెడ్డి సహా పలువరు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రోటోకాల్ పాటించాలనే ఇంగిత జ్ఞానం లేదా? అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మిస్టర్ కేటీ రావూ… ఫాంహౌస్ నుంచి తెచ్చిన సొమ్ములతో కాదు, ప్రజలు కట్టిన పన్నులతో చేస్తున్న అభివృద్ధి జరుగుతోందంటూ ఎద్దేవా చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి దొంగల్లా ముగించుకొని పోవల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

మరోవైపు… ముషీరాబాద్ లోనూ మంత్రి కేటీఆర్ కు బీజేపీ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. ముషీరాబాద్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే టీఆర్ఎస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. మొత్తానికి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోని వివాదానికి కారణమయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి