iDreamPost

ఇక్కడుంది చంద్రబాబు కాంగ్రెస్.. YSR కాంగ్రెస్ ని జగన్ AP తీసుకెళ్లారు: KTR

ఇక్కడుంది చంద్రబాబు కాంగ్రెస్.. YSR కాంగ్రెస్ ని జగన్ AP తీసుకెళ్లారు: KTR

ఉచిత కరెంట్ విషయంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తాము తెచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తమదని చెప్పుకుంటోందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకం పేటెంట్ హక్కులు తమవని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ మాటలన్నీ అర్థంలేని వాదనలంటూ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

“రాష్ట్రంలో ఉచిత కరెంట్ మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ తెచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు.. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ. ఇది ఒరిజినల్ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే.. ఈ చోటా చంద్రబాబు దండగ అంటాడు. అందుకే 3 గంటల విద్యుత్ చాలు అంటూ మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు- ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్ పార్టీ.

రైతులను చైతన్య వంతం చేసి.. కాంగ్రెస్ పార్టీ నిజ రూపాన్ని బయట పెడతాం. అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఎక్కడన్నా ఉచితంగా 10 గంటలు అయినా విద్యుత్ ఇస్తోందా? లాగ్ బుక్కులు కావాలంటూ రాజకీయం చేస్తున్నారు. తప్పుకుండా చర్చ పెట్టి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కరెంట్ కావాల్నా? కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కావాల్నా అని అడిగుదాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఇచ్చినట్లు 3 గంటలు 4 గంటల కరెంట్ కావాల్నా? ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నట్లు 24 గంటల ఉచిత విద్యుత్ కావాలా? అని అడుగుదాం.

మళ్లీ అప్పట్లో లాగా మోటర్లు కాలిపోవడం, స్టాటర్లు పేలిపోవడం కావాల్నా? అర్ధరాత్రి పోయి బాయి దగ్గర పడుకోవడం కావాలా? పాము కాట్లు, తేలు కాట్లు కావాలా? మనుషులు చావడం కావాలా? కేసీఆర్ పరిపాలనలో ఇచ్చినట్లుగా 24 గంటల కరెంట్ కావాలా అని అడుగుదాం. చైతన్య వంతులైన రైతులు కచ్చితంగా సరైన తీర్పు చెబుతారని నమ్ముతున్నాం. పక్క రాష్ట్రాల వాళ్లు మన విధానాలు ఉత్తమంగా ఉన్నాయి అంటున్నారు. వ్యవసాయం కోసం కేసీఆర్ చేస్తున్న రైతు భీమా, రైతు బంధు, 24 కరెంట్, ఊరు ఊరుకి కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ బాగున్నాయి అంటున్నారు. వాటిని తాము కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతిపక్షం ఎందుకు ఆలోచించలేకపోతోందో రైతులు ఆలోచించుకోవాలి” అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి