iDreamPost

సింగపూర్‌.. శ్రీకాకుళం.. మంత్రి రైమింగ్‌ కౌంటర్‌..

సింగపూర్‌.. శ్రీకాకుళం.. మంత్రి రైమింగ్‌ కౌంటర్‌..

తన పాత బాస్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కౌంటర్లు పేల్చుతున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత, ఒకప్పటి తన పాత బాస్‌కు రైమింగ్‌తో కూడిన పదాలతో ధీటుగా జవాబిస్తున్నారు.

మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాఖపై తన అనుకూల మీడియా, పార్టీ నేతలతో వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. విశాఖలో భద్రతా సమస్యలున్నాయని, తుఫాన్లు వస్తాయని విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రి అవంతి శ్రీనివాస్‌ చంద్రబాబుపై ఫైర్‌ అవుతున్నారు. చంద్రబాబుకు సింగపూర్‌పై ఉన్న ప్రేమ శ్రీకాకుళంపై లేదని విమర్శిస్తున్నారు. కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యంటూ తన పాత బాస్‌పై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు.

రాష్ట్రం నుంచి పెట్టుబడులు పోతున్నాయంటూ చంద్రబాబు మాట్లాడడంపై కూడా ఆవంతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో విశాఖలో రాజధాని ఏర్పాటు చేయొచ్చని అవంతి స్పష్టం చేస్తున్నారు.

కార్యనిర్వాహక రాజధాని విశాఖ సమీపంలోని భీమిలిలో ఏర్పాటు కానుంది. ఆ నియోజకవర్గం నుంచే అవంతి మొదట నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో పీఆర్‌పీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి విజయబావుటా ఎగురువేశారు. ఆ తర్వాత పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆ పార్టీలో చేరారు. మాజీ మంత్రి గంటాతో సన్నిహితంగా మెలిగారు. ఆయనతోపాటు 2014లో టీడీపీలోకి వెళ్లారు. అనకాపల్లి లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఐడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి తిరిగి భీమిలి నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా చాన్స్‌ కొట్టేశారు. ఈనేపథ్యంలో తన నియోజకవర్గానికి వచ్చే బృహత్తర అవకాశాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ జిల్లా మంత్రిగా కూడా జిల్లా అభివృద్ధితోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుపై ఫైర్‌ అవుతూ ప్రభుత్వం, ఉత్తరాంధ్ర ప్రజల్లో మార్కులు సంపాదిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి