iDreamPost

Mayuri : నిజమైన బయోపిక్ అంటే ఇది

ఉత్తమాభిరుచి సినిమాలు మాత్రమే తీయాలని సంకల్పించుకున్న రామోజీరావు గారికి నాట్య కళాకారిణి సుధాచంద్రన్ గురించి తెలిసింది. కాలు పోగొట్టుకున్నా తదేక దీక్షతో లక్ష్యం సాధించిన ఆవిడ ప్రస్థానం ఆకర్షించింది.

ఉత్తమాభిరుచి సినిమాలు మాత్రమే తీయాలని సంకల్పించుకున్న రామోజీరావు గారికి నాట్య కళాకారిణి సుధాచంద్రన్ గురించి తెలిసింది. కాలు పోగొట్టుకున్నా తదేక దీక్షతో లక్ష్యం సాధించిన ఆవిడ ప్రస్థానం ఆకర్షించింది.

Mayuri : నిజమైన బయోపిక్ అంటే ఇది

ఇప్పుడంటే రియాలిటీ షోలలో పడి అసలు నృత్యమంటే ఏమిటి, దాని విలువ ఎంతనేది ప్రెజెంట్ జనరేషన్ పట్టించుకోవడం లేదు కానీ ఒకప్పుడు ఈ కళ పట్ల జనంలో ఉండే ఆదరణ, ఆసక్తి క్లాసిక్ సినిమాలు తీసేలా ప్రేరేపించాయి. ఒక గొప్ప ఉదాహరణే మయూరి. 1983. ఈనాడు దినపత్రికతో తెలుగునాట చెరిగిపోని ముద్రవేసిన రామోజీరావు సినిమా నిర్మాణంలో అడుగు పెట్టి డెబ్యూ మూవీ శ్రీవారికి ప్రేమలేఖతో గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తీసిన కాంచనగంగ విమర్శకుల ప్రశంసలు అందుకోగా సుందరి సుబ్బారావు పర్వాలేదనిపించుకుంది. ఉత్తమాభిరుచి సినిమాలు మాత్రమే తీయాలని సంకల్పించుకున్న రామోజీరావు గారికి నాట్య కళాకారిణి సుధాచంద్రన్ గురించి తెలిసింది. కాలు పోగొట్టుకున్నా తదేక దీక్షతో లక్ష్యం సాధించిన ఆవిడ ప్రస్థానం ఆకర్షించింది.

ఈవిడ కథనే సినిమా చూపిస్తే ఎన్నో తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చినవారవుతామని భావించారు. రచయిత గణేష్ పాత్రోకు కబురు వెళ్ళింది. ఆయన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. రామోజీ చెప్పిన చిన్న చిన్న మార్పులతో ఫైనల్ వెర్షన్ సర్టిఫై చేశారు. దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు కన్నా బెస్ట్ ఆప్షన్ వాళ్లకు తోచలేదు. అప్పటికాయన స్టార్ హీరోలతో డీల్ చేయనప్పటికీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ వ్యవహారమంతా సుధాచంద్రన్ కు తెలియదు. ఎంత ప్రయత్నించినా ఆమె అడ్రెస్ ఉషాకిరణ్ వాళ్లకు దొరకలేదు. ఈలోగా హీరోయిన్ కోసం ఆడిషన్లు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళ నాన్న ఆచూకీ పట్టుకుని నేరుగా సుధాని కలిసి మరికొన్ని ముఖ్యమైన సంఘటనలు జోడించి మార్పులు చేర్పులు చేశారు. ఎవరితో తీయడం ఎందుకు సుధానే హీరోయిన్ గా చేయొచ్చు కదానే ఆలోచన వచ్చింది.

ఎన్నో ప్రయత్నాలు రాయబారాల తర్వాత సుధాచంద్రన్ మయూరిలో నటించేందుకు ఒప్పుకున్నారు. 1984లో షూటింగ్ మొదలుపెట్టారు. ఎస్పి బాలసుబ్రమణ్యం సంగీతం సమకూర్చగా హరి అనుమోలు ఛాయాగ్రహణం నిర్వహించారు. పాటలన్నీ వేటూరివే. జైపూర్, మదరాసు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వ్యయప్రయాసల మధ్య షూట్ జరిగింది. తన కథే కావడంతో సుధాచంద్రన్ ప్రాణం పెట్టి నటించారు. 1985 మార్చి 8 విడుదలైన మయూరి ఆబాలగోపాలాన్ని అలరించి అద్భుత విజయం అందుకుంది. ఆ ఏడాదికి గాను ఏకంగా 12 నంది అవార్డులు సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని విదేశీయుల మన్నన పొందింది. దీన్నే హిందీ నాచే మయూరిగా రీమేక్ చేస్తే అక్కడా ఇదే ఫలితం అందుకుంది

Also Read : Dasara Bullodu : పల్లెటూరి సినిమాల్లో నిజమైన ట్రెండ్ సెట్టర్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి