iDreamPost

ఉండవల్లి ఉడుంపట్టు

ఉండవల్లి ఉడుంపట్టు

పట్టుపట్టరాదు.. పట్టువిడువరాదు.. అనే వేమన సుమతి శతకం రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యవహార శైలికి అతికినట్లు సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మీడియా టైకూన్‌గా, కింగ్‌ మేకర్‌గా ఛలామని అవుతున్న రామోజీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఆర్థిక అక్రమాలపై ఉండవల్లి పట్టువిడువకుండా పోరాడుతున్నారు. అన్ని విధాలుగా అంత్యంత బలవంతుడైన రామోజీరావుపై మేథస్సు తప్పా అంగ, అర్థబలం లేని ఉండవల్లి పోరాటం అనన్యమైనదని చెప్పవచ్చు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ పేరుతో అనధికారికంగా 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆర్థిక నేరం నుంచి రామోజీ రావు తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పట్టువిడువని పోరాటంతో చిత్తవుతున్నాయి. ముగిసిపోయిందనుకున్న ఈ కేసులో తాజాగా సుప్రిం కోర్టు నోటీసులు జారీ చేయడం రామోజీరావుకు పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు.. అంటే 2018 డిసెంబర్‌ 31వ తేదీన రామోజీరావు పిటిషన్‌ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసును ఏకసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ ఆదేశాలు వెలువరించింది. దాంతో 2006 నుంచి తనకు తలనొప్పిగా మారిన ఈ వ్యవహారం ముగిసిందని రామోజీ రావు భావించారు.

కానీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాత్రం ఈ కేసును వదల్లేదు. ఆర్‌బీఐ చట్టాలకు విరుద్ధమైన అర్థాలు చెబుతూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసును కొట్టివేసిన ఉమ్మడి హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పును సుప్రిం కోర్టులో సవాల్‌ చేశారు. పూర్వాపరాలు విచారించిన సుప్రిం త్రిసభ్య ధర్మాసనం తాజాగా రామోజీరావుకు నోటీసులు జారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది.

2006లో మార్గదర్శిలో జరుగుతున్న ఆర్థిక నేరాలను అప్పటి ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెలుగులోకి తెచ్చారు. దాదాపు 2.50 లక్షల మంది నుంచి రామోజీ రావు అనధికారికంగా 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారని, వాటిని అక్రమంగా తన సంస్థల్లోకి మళ్లించారని ఆరోపించారు. ఈనాడు మినహా మార్గదిర్శి సహా రామోజీ ఇతర సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రామోజీరావు, ఉండవల్లి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఉండవల్లి చేసిన ఆరోపణలపై ఈనాడులో ఖండిస్తూ కథనాలు ప్రచురిచేవారు. ఉండవల్లి దెబ్బకు నష్టాల్లో ఉన్న మార్గదర్శి వెయి కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నట్లు చూపించారు. ఇలా ఎలా సాధ్యమో చెప్పాలంటూ దానిపై ఉండవల్లి మళ్లీ ప్రశ్నలు సంధించారు. ఇలా రామోజీ, ఉండవల్లి మధ్య మార్గదర్శి చిట్‌ఫండ్‌ యుద్ధం జరిగింది.

మీడియా మొఘల్‌గా ఉంటూ తెలుగు రాజకీయాలను శాసిస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో 2009 ఎన్నికల్లో ఈనాడు పని చేసింది. వరుసగా రెండోసారి రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న ఉండవల్లిని ఓడించేందుకు రామోజీ తన శక్తియుక్తులను, యంత్రాంగాన్ని ఉపయోగించారు. అయినా ఉండవల్లి గెలుపును ఆపలేకపోయారు.

2016లో రామోజీ రావుకు దేశ రెండో అత్యున్నత పురష్కారమైన పద్మవిభూషన్‌ వరించగా.. దానిపైనా ఉండవల్లి పోరాటం చేశారు. ఆర్థిక, సివిల్‌ నేరాలు ఉన్న వ్యక్తి ఆ పురష్కారం ఎలా ఇస్తారంటూ మీడియా సాక్షిగా పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా తాను లేవనెత్తిన విషయాలను ప్రస్తావిస్తూ, రామోజీరావుపై ఉన్న కేసులను పొందుపరుస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు.

దాదాపు 15 ఏళ్లుగా మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేంద్రంగా రామోజీరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మధ్య సాగుతున్న ఈ వైరం సహజనది గోదావరి ప్రవాహాన్ని తలపిస్తోంది. జీవిత చరమాంకంలో ఉన్న రామోజీరావుకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు ఆయన జీవితంలో మాయనిమచ్చలా మిగలడం ఖాయం. ఈ వ్యవహారంలో సుప్రిం కోర్టులో సాగనున్న విచారణ ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి