iDreamPost

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా కంపెనీ..!

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా కంపెనీ..!

ఆటో మొబైల్‌లో పాటు అనేక రంగాల్లో తిరుగులేని సంస్థగా పేరు గాంచింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ సంస్థ ప్రస్తుత చైర్ పర్సన్ ఆనంద్ మహింద్రా గురించి చెప్పనక్కర్లేదు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా సామాజిక అంశాలతో పాటు ఆసక్తికరమైన, తనను ఆకట్టుకున్న అంశాలను సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అలాగే తన కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగుల బాగోగులు చూస్తుంటారు. అయితే ఇప్పుడు మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు ఆనంద్ మహీంద్రా సంస్థ. తన కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.  వారికి మెటర్నిటీ లీవ్స్ పెంచింది. ప్రస్తుతం కొన్ని పేరు మోసిన కంపెనీల్లో ఆరు నెలల పాటు మాత్రమే ప్రసూతి సెలవులు ఉంటాయి. కానీ ఈ సంస్థ ఏకంగా ఐదేళ్లకు పెంచింది.

తల్లి, బిడ్డల మధ్య బాండింగ్ చాలా అవసరం. ఉద్యోగం పేరిట మహిళలు..డెలివరీ అయిన కొన్ని నెలలకే పిల్లల్ని వదిలి.. ఉద్యోగాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. దీంతో చిన్న చిన్న ఆనందాలను తల్లి, బిడ్డ ఇద్దరూ కోల్పోతున్నారు. ఇలాంటి అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ప్రసూతి సెలవులను పెంచింది సంస్థ. పిల్లలతో సమయాన్ని కేటాయించడంతో పాటు విధులకు హాజరు అయ్యే విధంగా కొత్త మెటర్నిటీ పాలసీని తీసుకువచ్చింది. ఇది కేవలం పిల్లల్ని కన్న తల్లులకే కాదూ.. పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకు సైతం వర్తించేలా నిబంధనలను మార్చనుంది. ఈ పాలసీ పరిమితి 5 ఏళ్లు ఉండనుంది. మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తించనుంది. ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలు కూడా ఈ పాలసీ పరిధిలోకి వస్తారు.

ఈ పాలసీ ప్రకారం.. ప్రీ చైల్డ్ బర్త్ కింద ఏడాది, మెటర్నిటీ ఏడాది, పోస్టు మెటర్నిటీ కింద 3 ఏళ్ల పాటు సెలవులు రానున్నాయి. మేనేజర్ ఆమోదంతో 6 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్, 24 నెలల హై బ్రిడ్ వర్కింగ్ ఆప్షన్ పొందుతారు. దీంతో పాటు ఒక వారం తప్పనిసరి ప్రసూతి సెలవులు కూడా ఇస్తారు. చైల్డ్ బాగోగులు చూసుకోవాలని భావించే ఉద్యోగులు.. వేతనం లేకుండా సెలవు ఎంచుకునే ఆప్షన్ కల్పిస్తోంది. ఈ సౌకర్యం కంపెనీలో 36 నెలలుగా (అంటే 3 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. అంటే వీరికి ఉద్యోగ భద్రత ఉన్నట్లే లెక్క. మెటర్నిటీ సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగానికి వచ్చే నారీమణుల కోసం కంపెనీ కెరీర్ హమీ పాలసీని కూడా అందిస్తోందని చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆశా ఖర్గా వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి