iDreamPost

కొన్ని సినిమా పాఠాలు చాలా ఖరీదు – Nostalgia

కొన్ని సినిమా పాఠాలు చాలా ఖరీదు – Nostalgia

స్టార్ హీరోల సినిమాలకు భారీతనం చాలా అవసరం. కథ డిమాండ్ కు తగ్గట్టుగానో లేదా అభిమానుల అభిరుచులకు అనుగుణంగానో వీళ్ళను డీల్ చేస్తున్న దర్శకులు కథలు రాసుకునే టైంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఒక్క అంశం కంట్రోల్ తప్పినా ఫలితం తేడా కొట్టడమే కాదు పెట్టుబడిని సైతం రిస్క్ లో పెడుతుంది. అందుకో ఉదాహరణగా ‘అర్జున్’ని చెప్పుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మాస్ లో అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు గుణశేఖర్ గురించి జాతీయ స్థాయిలోనూ మాట్లాడుకున్నారు. రికార్డులన్నీ బద్దలయ్యాయి. కలెక్షన్ల వర్షం కురిసి డిస్ట్రిబ్యూటర్లు తడిసి ముద్దయ్యారు.

దీని అంచనాలు నిలబెట్టుకోలేకే విషయమున్న ‘నిజం’ ఆశించిన ఫలితం అందుకోలేకపోగా ఏదో ప్రయోగం చేయాలని ట్రై చేసిన ‘నాని’ అడ్డంగా బోల్తా కొట్టేసింది. మహేష్ కి తాను చేస్తున్న పొరపాటు అర్థమయ్యింది. అవతల గుణశేఖర్ తనకోసమే నెలల తరబడి సిద్ధం చేసుకున్న అర్జున్ కథ విన్నాక ఇంకేం ఆలోచించాలనిపించలేదు. నిర్మాణ రంగంలోకి రావాలని ఎదురు చూస్తున్న అన్నయ్య రమేష్ బాబుని నిర్మాతగా ఒప్పించి ఒక్కడు కన్నా చాలా భారీ బడ్జెట్ డిమాండ్ చేస్తున్నా వెనుకాడకుండా రెడీ అయ్యారు. కీలక భాగం మధురైలో జరుగుతుంది. కానీ అక్కడ అనుమతులు దొరకవు కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణితో కోట్ల రూపాయల ఖర్చుతో గుడిని నిర్మించేశారు. కేవలం ఇది చూసేందుకు ఇండస్ట్రీ పెద్దలు సైతం సెట్ కి వచ్చేవారంటే అది ఏ స్థాయిలో రూపొందిందో అర్థం చేసుకోవచ్చు.

మణిశర్మ సంగీతం, శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఇలా టాప్ టీమ్ సెట్ అయ్యింది. కవల అక్కయ్య అత్తారింటికి వెళ్ళాక కష్టాల్లో ఉందని తెల్సుకున్న తమ్ముడు అక్కడి విలన్లైన అత్తా మామలతో చేసే యుద్ధమే ఈ సినిమా. భారీతనం, రిచ్ క్యాస్టింగ్, కళ్ళు చెదిరిపోయే మీనాక్షి గుడి సెట్ ఇవేవి అర్జున్ ని బ్లాక్ బస్టర్ చేయలేకపోయాయి. సెంటిమెంట్ డ్రామా పాళ్లు ఎక్కువ కావడంతో పాటు పుట్టింటికిరా చెల్లి ఫార్ములాని కమర్షియల్ గా చెప్పాలని చూసిన గుణశేఖర్ ప్రయత్నం యావరేజ్ గా మిగిలిపోయింది. కథ కోసం సెట్లు వేయాలి కానీ సెట్లు వేసేందుకు కథ రాసుకోకూడదనే పాఠం నేర్పించింది. అయినా కూడా మూడు నందులు దక్కించుకున్న అర్జున్ 2004 ఆగస్ట్ 20న రిలీజై మహేష్ కు ఒక స్పెషల్ మూవీగా మిగిలిపోయింది

Also Read : భర్త కోసం తపించే ఓ భార్య కథ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి