iDreamPost

Mahaan Review : మహాన్ రివ్యూ

Mahaan Review : మహాన్ రివ్యూ

చియాన్ విక్రమ్ అయన కొడుకు ధృవ్ కలయికలో మొదటిసారి రూపొందిన సినిమా మహాన్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఇవాళే ప్రైమ్ ద్వారా విడుదలయ్యింది. అయితే ఎప్పటి లాగే ముందు రోజు రాత్రి 10 నుంచే ఓటిటి ప్రీమియర్లు స్టార్ట్ అయిపోయాయి. గత కొంత కాలంగా ఓటిటిలో చెప్పుకోదగ్గ స్టార్ హీరో మూవీ ఏదీ రాకపోవడంతో మహాన్ మీద ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు మళయాలం కన్నడ భాషల్లో ఏకకాలంలో తీసుకొచ్చిన ఈ సినిమా కాంబినేషన్ కు మీద ఉన్న హైప్ కు తగ్గట్టు ఉందో లేక ప్రైమ్ కు మరో బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అయ్యిందో రివ్యూలో చూద్దాం

కథ

ఉన్నత ఆదర్శాలతో పాటు మద్యనిషేద పోరాటానికి పాటుపడిన కుటుంబం గాంధీ మహాన్(విక్రమ్)నాన్నగారిది. ఈ భావజాలం బలవంతంగా రుద్దబడిన మహాన్ జీవితాన్ని చప్పగా గడుపుతూ ఉంటాడు. భార్య(సిమ్రాన్)నిత్యం దెప్పి పొడుస్తూ ఉంటుంది. అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు సత్యవన్(బాబీ సింహా)ను కలిసిన మహాన్ తాగుడుకు అలవాటై కుటుంబాన్ని దూరం చేసుకుని పెద్ద లిక్కర్ కింగ్ గా మారతాడు. కట్ చేస్తే ఇరవై ఏళ్ళ తర్వాత కొడుకు దాదాబాయ్ నౌరోజీ(ధృవ్)పోలీస్ ఆఫీసర్ గా వచ్చి మహాన్ గ్యాంగ్ లో ఒక్కొక్కరిని చంపడం మొదలుపెడతాడు. ఆ తర్వాత జరిగేది స్మార్ట్ స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు

నటీనటులు

ఒకప్పుడు అపరిచితుడు, ఐ, ఇంకొక్కడు లాంటి సినిమాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా యాక్టింగ్ కో కొత్త డెఫినేషన్ చూపించిన విక్రమ్ చాలా గ్యాప్ తర్వాత మహాన్ గా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వయసు మళ్ళిన క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించాడు. ఆర్టిస్టులు ఎందరు ఉన్నా పూర్తిగా వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. కరుడు గట్టిన డాన్ గా మారిన తర్వాత స్వంత బిడ్డే తన దగ్గరివాళ్లను చంపుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో చూపించిన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఈ ఏజ్ లోనూ తన ఫిట్ నెస్ పట్ల విక్రమ్ తీసుకుంటున్న శ్రద్ధ, ఫ్యాషన్ ని అభినందించకుండా ఉండలేం.

ధృవ్ కు తన రేంజ్ కి మించిన క్యారెక్టర్ ఇచ్చారు. బరువు ఎక్కువయ్యింది కానీ సీన్స్ లో ఉన్న డెప్త్ దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది. తండ్రితో పోలిస్తే అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు కానీ ఇతను పూర్తి స్థాయి స్టార్ మెటీరియల్ కావడానికి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మరిన్ని రావాలి. బాబీ సింహా సత్యవన్ గా చెలరేగిపోయాడు. మినిస్టర్ జ్ఞానం పాత్రలో వెట్టై ముత్తు కుమార్ పర్ఫెక్ట్ ఛాయస్. రాకీగా సనంత్ కు మంచి స్పేస్ దక్కింది. వాడుకున్నాడు. సిమ్రాన్, రామచంద్రన్, బెనిటో ఫ్రాంక్లిన్, గజరాజ్, సుబత్రా తదితరులు వాళ్ళకిచ్చిన తక్కువ సీన్లలో చక్కగా చేసుకుంటూ పోయారు. ఇంతకు మించి క్యాస్టింగ్ ఏమి లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ది విలక్షణ శైలి. కెరీర్ మొదట్లో చేసిన పిజ్జా, జిగర్ తండాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. తనకంటూ ఒక భావజాలం ఉంది. సాధ్యమైనంత వరకు దాన్ని ఏదోలా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే రజనీకాంత్ స్టైల్ కోసం పేటలో తన ఫార్మాట్ ని పక్కనపెట్టి కమర్షియల్ ఫార్ములాకు షిఫ్ట్ అయిపోయాడో అప్పటి నుంచి ఒకరకమైన కన్ఫ్యూజన్ మొదలయ్యింది. గత ఏడాది జగమే తంతిరంకు అంత దారుణమైన రెస్పాన్స్ రావడానికి కారణం ఇదే. రెండూ బ్యాలన్స్ చేయాలనే తాపత్రయంలో పడవని అటుఇటు నడపడంతో రంధ్రాలు పడి లోపలికి నీళ్లొచ్చే పరిస్థితిని తెచ్చుకున్నాడు.

మహాన్ కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఇది చాలాసార్లు మనం తెలుగులోనే చూసిందే. చెడ్డవాడైన తండ్రిని కొడుకు ద్వేషించి అతని పతనాన్ని కోరుకోవడం నాగార్జున వారసుడులో చూశాం. ఎన్టీఆర్ కొండవీటి సింహంలో ఇది రివర్స్ లో ఉంటుంది. మున్నాలో ప్రభాస్ చేసింది కూడా ఇదే, నేటి సిద్దార్థలోనూ కొంత పోలిక చూడొచ్చు. స్నేహం కోసంలోనూ ఇంతే. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉంటాయి. మహాన్ వీటి బాటలోనే నడిచింది కానీ స్టైలిష్ మేకింగ్ అండ్ టెక్నికల్ స్టాండర్డ్ తో కొంచెం విభిన్నంగా కనిపిస్తుంది అంతే. విక్రమ్ ధృవ్ ల కాంబో ఎగ్జైట్ చేస్తుందనే అంచనా కరెక్టే కానీ కథా కథనాలు ఇంకా బలంగా ఉండాల్సింది.

గాంధీ మహాన్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ లో వీక్ గా ఉండటం ఇందులో ప్రధాన మైనస్. కేవలం ఒకసారి తాగాడన్న కారణంగా భార్య జీవితాంతం వదిలి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకోవడం అంత సబబుగా అనిపించదు పైగా ఆవిడతో చేయించిన ఓవరాక్షన్ ఎబెట్టుగ ఉంది. దీనికి కావాల్సిన ఎస్టాబ్లిషమెంట్ సినిమా ప్రారంభం ఫ్లాష్ బ్యాక్ లో చేసినప్పటికీ అదీ ప్రాపర్ గా లేకపోవడంతో ఎమోషనల్ గా ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. కాకపోతే విక్రమ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్నో లోపాలను కాచుకుంటూ వచ్చింది. మొదటిసగంలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కానీ ఎగ్జైటింగ్ అనిపించే ఫైట్స్ కానీ లేకపోవడంతో మాములుగా సాగిపోతుంది.

ఇంటర్వెల్ బ్లాక్ లో ధృవ్ ఎంట్రీ తర్వాత కథనం పరుగులు పెడుతుంది. కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తండ్రిని అంతగా ద్వేషించడానికి ప్లాట్ ని బాగానే సెట్ చేశారు కానీ అందరిని చంపించేసి చివరికి మాత్రం క్లైమాక్స్ ని రెగ్యులర్ గా డిజైన్ చేయడం ఫీల్ ని తగ్గించేసింది. నాయకుడులో కమల్ హాసన్ పాత్ర బ్రతికే ఉంటె వీరయ్య నాయుడు చేసిన తప్పులను మణిరత్నం ఒప్పుకున్నట్టు అయ్యేది. కానీ సినిమాటిక్ సెన్స్ కోసమైనా ఆయన అలా చేయలేదు. ఓ పిచ్చివాడితో చంపించి మైండ్ బ్లాంక్ చేశారు. కానీ మహాన్ లో అభిమానుల కోసమో మరి ఇంకేదైనా కారణమో చెప్పలేం కానీ ముగింపు మాత్రం పూర్తి సంతృప్తి ఇవ్వదు.

మొత్తంగా చెప్పాలంటే మహాన్ చాలా మాములుగా ఉన్నాడు. మరీ చెప్పుకోదగ్గ మెరుపులు విన్పించే అరుపులు లేవు. తమిళ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మరీ ఇంత డార్క్ మాఫియా డ్రామాలు మనకు కనెక్ట్ కావడం కష్టమే. దానికి తోడు నిడివి కూడా ఎక్కువగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించిన సంభాషణలు జొప్పించడం చిరాకు తెప్పిస్తుంది. ఓటిటి కాబట్టి ఎడిటింగ్ ఎందుకులే అనుకున్నారో ఏమో ఫార్వార్డ్ చేసే పనిని మాత్రం అక్కడక్కడా కల్పిస్తూనే వచ్చారు. విక్రమ్ ధృవ్ కాంబినేషన్ కంటికింపుగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ విక్రమ్ తో ఈ కలయిక ఇంకెవరితో జరిగినా డ్యామేజ్ ఎక్కువ జరిగేది

సంతోష్ నారాయన్ నేపధ్య సంగీతం బాగానే ఉంది. పాటల్లో రణగొణ ధ్వని తప్ప ఒక్కటీ గుర్తుండదు మళ్ళీ వినాలనిపించదు. శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం మాత్రం కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచనలను పర్ఫెక్ట్ గా ఆవిష్కరించింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంటే ఈజీగా ఓ ఇరవై నిమిషాల కోత పడి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టేది. దినేష్ సుబ్బరాయన్ పోరాటలు ఆకట్టుకుంటాయి. సంభాషణలు సుదీర్ఘంగా ఉండటం లోపమే. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేమ్ బోర్డులు, పత్రికలు అన్నీ తెలుగులోనే కనిపించేలా చూసుకున్నారు. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి. రాజీ పడినట్టు అనిపించలేదు

ప్లస్ గా అనిపించేవి

విక్రమ్ నటన
తండ్రి కొడుకుల సీన్స్
యాక్షన్ బ్లాక్స్
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
క్యారెక్టరైజేషన్లు
పాటలు
ఎమోషన్స్

కంక్లూజన్

తెలుగులో ఎంత మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ మార్కెట్ ఏనాడో తగ్గిపోయిన విక్రమ్ నుంచి వచ్చిన మరో మాములు సినిమా మహాన్. గొప్పగా లేదు అలా అని చెత్తగా లేదు. జగమే తంతిరంతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు బెటర్ అనిపించేలా కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ తో పాస్ కావడం ఒక్కటే ఇందులో సానుకూలాంశం. డార్క్ మాఫియా స్లో డ్రామాస్ ని ఎంజాయ్ చేసేవాళ్లుకు ఇది మంచి ఛాయసే. ఏవేవో ఊహించుకుని మొదలుపెట్టే వాళ్లకు మాత్రం జస్ట్ ఓకే మూవీగా మిగిలిపోతుంది. విక్రమ్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తప్ప ఇంకే కారణం అక్కర్లేదనుకుంటే మహాన్ ని హ్యాపీగా చూసేయొచ్చు. ఆ అంచనాను మాత్రం నిలబెట్టుకుంటుంది

ఒక్క మాటలో : మాములు మహాన్

Also Read : Saamanyudu Review : సామాన్యుడు రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి