iDreamPost

చిన్న సినిమాలకు మార్గమేదీ

చిన్న సినిమాలకు మార్గమేదీ

థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు అనడం కన్నా తెరవడం లేదు అని చెప్పడం సబబు. యాజమాన్యాలు ఇప్పట్లో సుముఖంగా కనిపించడం లేదు. కారణం కొత్త సినిమాలు లేకపోవడం. ఇంత ఖర్చు పెట్టుకుని పాతవి వేసుకుని రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. చాలా చోట్ల సిబ్బందికి జీతాలు లేవు. ఇప్పుడు హాలు ఓపెన్ చేసి ఒక్క ఆట వేసినా సరే ఆ క్షణం నుంచే ఖర్చు మొదలవుతుంది. అసలు ఏ నిర్మాతలు రిలీజ్ డేట్లను ప్రకటించడం లేదు. అందరూ ఆగస్ట్ సెప్టెంబర్ అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. వాళ్ళను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే కోట్లతో ముడిపడిన వ్యవహారం కాబట్టి.

కానీ చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఓటిటినా థియేటరా అని తేల్చుకోలేక కిందామీద పడుతున్నారు. అటు చూస్తేనేమో ఓటిటిలు మరీ కాయగూరలు కొంటున్న తరహాలో బేరమాడుతూ ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నాయన్న టాక్ ఉంది. ఇటు చూస్తేనేమో థియేటర్లు తెరవడం ఆలస్యం కాస్త బ్యాక్ గ్రౌండ్ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎటొచ్చి నరకం చూస్తోంది చిన్నవాళ్ళే. ఇష్క్, కనబడుట లేదు, హౌస్ అరెస్ట్, వివాహ భోజనంబు, కోతి కొమ్మచ్చి, బ్రతుకు బస్ స్టాండ్, పుష్పక విమానం, రౌడీ బాయ్స్, తిమ్మరుసు లాంటివన్నీ చాలా ఉన్నాయి క్యూలో. అసలివి ఎప్పుడు వదలాలో వాళ్ళకే అర్థం కానీ పరిస్థితి.

కరోనా వచ్చాక వెళ్ళిపోయాక లెక్కలు మారాయి. ప్రతి సినిమాను థియేటర్ కంటెంట్ అనలేం. ప్రేక్షకులు కూడా చాలా తెలివిగా ఆలోచించి హాలు దాక వెళ్లేంత అర్హత ఫలానా చిత్రానికి ఉందా లేదాని రకరకాల కాలిక్యులేషన్లు వేసుకుని మరీ డిసైడ్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏదో చెప్పుకోవడానికి థియేట్రికల్ రిలీజ్ చేస్తే సరిపోదు. పైగా పబ్లిసిటీతో మొదలుపెట్టి హాలు అద్దెల దాకా రకరకాల ఖర్చులు. ఇలా గిట్టుబాటు కాదని గుర్తించి ఎక్కువ రోజులు వేచి చూడటం వల్ల ఉపయోగం లేదని తెలుసుకుని మాస్ట్రో లాంటి ఇమేజ్ ఉన్న హీరో సినిమానే డిజిటల్ ప్రీమియర్ కు వెళ్తోంది. మరి అలాంటప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏమిటో మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి