iDreamPost

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు

ఎప్పుడైనా కళ్ళగంతలు ఆట ఆడార? రాత్రి వేళలో కరెంట్ పోతే కళ్ళున్నా సరే అంధుల్లానే చిమ్మచీకటిని ఎప్పుడైనా అనుభవించారా? ఒకవేళ అలా చీకటిని అనుభవిస్తే అంధులు పడే బాధ మనకు అర్ధం అవుతుంది. కానీ చిమ్మ చీకటిని అనుభవించే అంధుల జీవితాలలో అక్షరాల వెలుగును నింపిన వ్యక్తి కూడా అంధుడే అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అలా అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడే లూయిస్ బ్రెయిలీ…

లూయిస్ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి 4 న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో మోనిక్ బ్రెయిలీ మరియు సైమన్ రెనె బ్రెయిలీ దంపతులకు జన్మించాడు. బ్రెయిలీ పుట్టుకతో అంధుడు కాదు. లూయిస్ బ్రెయిలీ తండ్రి గుర్రాలకు తోలు బెల్టులు తయారు చేస్తూ ఉండేవాడు. తండ్రి చేస్తున్న పనిని గమనిస్తూ తండ్రి షెడ్డులో ఆడుకుంటూ ఉండేవాడు బ్రెయిలీ.. కానీ ఒకరోజు తండ్రిలేని సమయంలో తండ్రి వర్క్ షాపులో తండ్రి చేసే పనిని అనుకరిస్తుండగా సూదిగా ఉన్న పదునైన వస్తువు ప్రమాదవశాత్తు లూయిస్ బ్రెయిలీ కంటిలో గుచ్చుకుంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా డాక్టర్ కూడా బ్రెయిలీ కంటికి తగిలిన గాయాన్ని నయం చేయలేక పోయాడు. ఈలోగా ఇన్ఫెక్షన్ రెండో కంటికి కూడా సోకడంతో బ్రెయిలీ జీవితం అంధకారమైంది. అలా మూడు సంవత్సరాల చిన్నవయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నాడు లూయిస్ బ్రెయిలీ.

చూపు కోల్పోయినా సరే బ్రెయిలీ నిరాశకు లోనవ్వలేదు. వాలెంటైన్‌ హ్యూ 1784లో ప్రారంభించిన అంధుల పాఠశాలలో బ్రెయిలీ చదువును కొనసాగించాడు. అసాధారణ ప్రతిభా పాఠవాలను చూపించి ఉత్తమ విద్యార్థిగా పేరు పొందాడు. అప్పటికి అంధులు చదువుకోవడానికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువును పూర్తి చేసాడు లూయి బ్రెయిలీ.. తన ప్రతిభ వల్ల తాను చదువుకున్న పాఠశాలలో 17 సంవత్సరాల వయస్సులోనే ప్రొఫెసరుగా నియమించబడ్డాడు. కానీ అప్పటికి అందుబాటులో ఉన్న అంధుల లిపి కేవలం చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. తిరిగి రాయాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ విషయాన్ని గుర్తించిన బ్రెయిలీ అంధులు చదువుకోవడంతో పాటుగా రాయడానికి కూడా వీలుగా సరికొత్త లిపిని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు.

పగలు పాఠశాలలో బోధిస్తూ రాత్రి మాత్రం అంధుల లిపి తయారీలో నిమగ్నమయ్యాడు. అంధులు సులువుగా చదువుకోవడానికి రాయడానికి ఉండాల్సిన అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుండాలని బ్రెయిలీ భావించాడు. చుక్కలు చుక్కలుగా వుంటే అంధులు చదవటం తేలిక అని బ్రెయిల్‌ గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేసాడు.అలా లిపి గురించి ప్రయత్నాలు చేస్తూ ఉండగా 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి 12 ఉబ్బెత్తు చుక్కలతో కూడిన సంకేత లిపిని తయారు చేసాడు. ఈ లిపిని రూపొందించడానికి ప్రధాన కారణం చీకటిలో కూడా తన సైనికులు తాను పంపిన సమాచారం గుర్తించాలని ఛార్లెస్ బార్బియర్ అనుకున్నాడు. ఈ లిపి గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను గుర్తుంచుకోవడం,చదవడం మరియు రాయడం అంధులకు క్లిష్టంగా ఉంటుందని భావించి 12 చుక్కలను కాస్తా ఆరు చుక్కలకు తగ్గించి ఆ చుక్కలను అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, పదాలను, అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.

లిపిని రూపొందించాడు కానీ 1824 లో బ్రెయిలీ అంధుల లిపిని కనిపెట్టాడు. కానీ ఆ లిపి ముద్రణ మాత్రం 1829 లో ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. కానీ లూయిస్ బ్రెయిలీ ఆ లిపిపై మరింత ప్రయోగాలు చేసి మరింత సరళంగా మార్చి 1837 అందరికీ అర్ధమయ్యే రీతిలో లిపిని రూపొందించాడు. కానీ బ్రెయిలీ లిపి మొదట్లో ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. పైగా అంధులకు ఏమాత్రం పనికిరాని లిపి అంటూ అందరూ కొట్టిపడేసారు. పాఠశాలలు కళాశాలలు బ్రెయిలీ లిపిని నిషేధించాయి. అంధుల లిపి కోసం పగలు ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాత్రి లిపిని రూపొందించిన బ్రెయిలీ క్షయ వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధితో బాధపడుతూ 1852 జనవరి 6 న 43 సంవత్స రాల పిన్న వయస్సులోనే మరణించాడు.

బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు ఆ లిపి విలువ ఎవరికీ తెలియలేదు. కానీ అయన మరణించిన తరువాత మాత్రం అంధుల జీవితాలకి బ్రెయిలీ లిపి ఆశాదీపం అయ్యింది. లూయిస్ బ్రెయిలీ శిష్యులు అయన మరణించిన తరువాత చేసిన పోరాటం ఫలితంగా బ్రెయిలీ లిపిలో ఉన్న గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటే లూయిస్ బ్రెయిలీకి ఉన్న ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది.బ్రెయిలీ లిపిని గుర్తించని పాఠశాలలు కళాశాలలు ప్రపంచవ్యాప్తంగ ఆయన లిపిని ఆమోదించాయి. మాములు వ్యక్తులకు ధీటుగా అంధులు చదువుకుంటున్నారంటే దానికి కారణం బ్రెయిలీ లిపి అని చెప్పడం అతిశయోక్తి కాదు.

బ్రెయిలీ ఉన్నప్పుడు ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ అయన మరణించిన తర్వాత మాత్రం విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చిపడ్డాయి. ఫ్రాన్స్ తమ దేశపు ముద్దుబిడ్డగా ఫ్రాన్స్ ప్రభుత్వం లూయిస్ బ్రెయిలీని గుర్తించింది. బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బ్రెయిలీ చేసిన సేవలకు గుర్తుగా పలు దేశాలు అయన బొమ్మతో కూడిన నాణాలను విడుదల చేసాయి. వీటిలో అమెరికా, బెల్జియం, ఇటలీ దేశాలు ఉన్నాయి.మన భారతదేశం కూడా లూయిస్ బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది.

త్రివిక్రమ్ ఖలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదని… ఆమాటలు సరిగ్గా లూయిస్ బ్రెయిలీ జీవితానికి సరిపోతాయి.. ఏదేమైనా అంధుల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపిన చీకటి సూర్యుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు. బ్రెయిలీ లిపి ఉన్నంత కాలం ఆ లిపిలో లూయిస్ బ్రెయిలీ సజీవంగా జీవించి ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి