iDreamPost

విశాఖను రాజధానిగా చేస్తే టీడీపీ సీట్లు పెరుగుతాయా! లోకేష్ కు ఏమయ్యింది

విశాఖను రాజధానిగా చేస్తే టీడీపీ సీట్లు పెరుగుతాయా! లోకేష్ కు ఏమయ్యింది

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. అమరావతి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది తమ రాజకీయ విధానం అమరావతి పరిరక్షణగా ప్రకటించింది. దానికోసం ఎన్ని ప్రయత్నాలయినా చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు సన్నద్ధమవుతోంది. అది తమ విధానంగా ప్రకటించుకుంది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని చెబుతోంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు లేని సమయంలో అంతటి పెద్ద ప్రాజెక్టులు పెనుభారం అవుతాయని చెబుతోంది. సామాజికంగా, ఆర్థికంగా కేంద్రీకరణ దుష్ఫలితాన్నిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ సమయంలో త్వరలోనే ముఖ్యమంత్రి విశాఖ తరలి వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎంవో అక్కడి నుంచే నడిపించే అవకాశం కనిపిస్తోంది. అది టీడీపీని కలవరపరుస్తోంది. విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలివెళితే దాదాపుగా పాలనా వ్యవహారాలు అటు మరలినట్టే అవుతుంది. ఇది టీడీపీ నేతలకు మింగుడుపడే అవకాశం లేదు. జగన్ ఎప్పుడు విశాఖ వెళ్లినా దాని ప్రభావం ఆపార్టీ మీద అనివార్యంగా పడుతుంది. ఇప్పటికే అమరావతి చుట్టూ కేంద్రీకరణ విషయం ఏపీలో అత్యధికులకు రుచించడం లేదు. చివరకు అమరావతిలోనే నాన్ కమ్మ కులస్తులు కూడా ఎక్కువ మంది సుముఖంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నిజంగానే సీఎం విశాఖకు మారితే తెలుగుదేశం పార్టీకి తలనొప్పి అవుతుంది.

టీడీపీకి అత్యంత గడ్డుపరిస్థితుల్లో కూడా కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కడంలో ఉత్తరాంధ్రదే కీలక పాత్ర.మొత్తం 23 సీట్లలో 6 సీట్లు ఆ ప్రాంతం నుంచి వచ్చాయి.అందులో నాలుగు స్థానాలు విశాఖ నగరంలోనే వచ్చాయి.కానీ ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ ఓటర్ల మీద పెద్ద ఆశలు పెట్టుకున్న టీడీపీ ఖంగుతింది. కార్పోరేషన్ ఓటర్లు వైసీపీకి జై కొట్టారు. అదే సమయంలో పలువురు టీడీపీ సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వంటి వారు పార్టీని వీడారు. గంటా శ్రీనివాసరావు అడుగులు ఎటు పడుతాయన్నది స్పష్టత లేదు. అలాంటి సమయంలో విశాఖను జగన్ తన ఆఫీసు కోసం ఎంచుకుంటే టీడీపీ నేతలు మాత్రం దానిని తాము గెలిస్తే అమరావతి తరలిస్తామని చెప్పాల్సిన స్థితి వస్తుంది. అది జనాలు హర్షించే అవకాశం లేదు. ప్రాంతీయ సెంటిమెంట్ తో టీడీపీ క్యాడర్ లోనూ అంగీకారం దక్కుతుందనే ధీమా లేదు.

ఈ పరిస్థితుల్లో ఉంటే జగన్ విశాఖ వెళితే టీడీపీకి సీట్లు పెరుగుతాయంటూ లోకేష్ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఆశ్చర్యకర వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా కనిపించే నారా లోకేష్ మాటలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేని స్థితి ఏర్పడుతోంది. ఉత్తరాంధ్రలో జగన్ సీఎంవో పెడితే అన్నివర్గాల్లోనూ జగన్ ఆదరణ పెరగడం అనివార్యంగా జరుగుతుంది. విశాఖ రాజధాని నగరంగా అభివృద్ధి అయితే ఆ ప్రాంతంలో ఉపాధి సహా వివిధ అవకాశాలు పెరుగుతాయనే అంశాలు చిగురించడం ఖాయం. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఇలాంటి మాటల వల్ల టీడీపీకి మేలు కన్నా కీడు ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అమరావతి కోసం కట్టుబడి ఉండడం వేరు, విశాఖలో ఆఫీసులు పెట్టడాన్ని వ్యతిరేకించడం వేరుగా గుర్తించాలని పలువురు నేతలు లోకేష్ కి సూచిస్తున్నారు ఇటీవల లోకేష్ చాలామంది నాయకులని ఖాతరు చేసే పరిస్థితి లేనందున టీడీపీని పూర్తిగా ముంచేపనిలో ఇలాంటివి తోడ్పడతాయనే వాదన బలపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి