iDreamPost

స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిలిచిపోవ‌డంతో ప్ర‌భుత్వానికి అపార‌న‌ష్టం

స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిలిచిపోవ‌డంతో ప్ర‌భుత్వానికి అపార‌న‌ష్టం

చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ అర్థాంత‌రంగా నిలిచిపోయింది. అనూహ్య కార‌ణాల‌తో ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం విశేషంగా మారింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారుతోంది. అనేక రాష్ట్రాల్లో వైర‌స్ వ్యాప్తి మూలంగా సాధార‌ణ వ్య‌వ‌స్థ‌లు స్తంభించాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విధిలేని ప‌రిస్థితుల్లో నిలిపివేయ‌క త‌ప్ప‌లేదు.

వాస్త‌వానికి 2018 లోనే స్థానిక ఎన్నిక‌లు ముగించాల్సి ఉంది. కానీ నాటి ప్ర‌భుత్వం దానికి సిద్ద‌ప‌డ లేదు. ముఖ్యంగా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉన్న త‌రుణంలో ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డేందుకు చంద్రబాబు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కాలేదు.స్థానిక ఎన్నికలు జరిపి వాటిలో ప్రతికూల ఫలితాలు వస్తే శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విఘాతం కలుగుతుందని చంద్రబాబు భావించడంతో స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ప్రభుత్వం ద్రుష్టి పెట్టలేదు. దాంతో ఏపీ లోని స్థానిక సంస్థ‌ల‌కు ఆర్థికంగా అవ‌స్థ‌లు త‌ప్ప‌లేదు. ముఖ్యంగా ప‌ద్నాలుగ‌వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దానికార‌ణంగా ఏపీలో రూ.4,200 కోట్ల మేర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.

దాంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని త‌లంచింది. దానికి అనుగుణంగా రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి జన‌వ‌రిలోనే నోటిఫికేష‌న్ కి సిద్ధ‌మ‌య్యింది. అయితే రిజ‌ర్వేష‌న్లు 50శాతానికి మించి ఉన్నాయంటూ టీడీపీ నేత‌లు కోర్టుని ఆశ్ర‌యించడంతో అవి జాప్యం అయ్యాయి. చివ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లు 50శాతం లోపు ఉండేలా స‌వ‌రించి, రీ నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని హైకోర్ట్ ఆదేశించ‌డంతో దానికి అనుగుణంగా మార్చిలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం హుటాహుటీన స‌న్న‌ద్ధ‌మ‌య్యింది.

మార్చి 31లోగా స్థానిక సంస్థ‌ల‌కు పాల‌క‌వ‌ర్గాలు ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌పోతే పెద్ద మొత్తంలో నిధులు నిలిచిపోయే ప్ర‌మాదం ఉండ‌డంతో వేగంగా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని ప్ర‌భుత్వం సంకల్పించింది. దానికి త‌గ్గ‌ట్టుగా నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ను కూడా పూర్తి చేసింది. జెడ్పీ, ఎంపీపీల‌తో పాటు మునిసిపాలిటీల‌కు కూడా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. పంచాయితీల‌కు కూడా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు సిద్ధ‌ప‌డింది. ఈలోగా క‌రోనా వైర‌స్ విస్తృతి క‌ల‌క‌లం రేప‌డంతో చివ‌ర‌కు అర్థాంత‌రంగా నిలుపుద‌ల చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఆర్థికంగా ఏపీ ప్ర‌భుత్వానికి ఇది తీవ్ర న‌ష్టాన్ని తీసుకురాబోతోంది. ఇప్ప‌టికే ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మ‌రుగుపోవ‌డం ఖాయం. మార్చి నెలాఖ‌రు నాటికి పాల‌క‌వ‌ర్గాలు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేనందున దాదాపుగా నాలుగున్న‌ర‌వేల కోట్లు కోల్పోవాల్సి వ‌స్తోంది. దాంతో పాటుగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌లో ఇప్ప‌టికే అంతా సిద్ధం చేసిన త‌ర్వాత మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చే ప‌రిస్థితి రావ‌డంతో అది కూడా భారంగా చెప్ప‌వ‌చ్చు. మొత్తంగా ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌కు క‌రోనా బ్రేకులు వేయ‌డంతో రెండువిధాలుగా ఏపీ ప్ర‌భుత్వం, స్థానిక సంస్థ‌లు న‌ష్ట‌పోవాల్సిన స్థితి దాపురించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి