iDreamPost

భూముల రీ సర్వేపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

భూముల రీ సర్వేపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్య శాశ్వత పరిష్కారానికి వైసీపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన జగన్‌ సర్కార్‌.. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇతర సదుపాయాలు సమకూర్చుకునేందుకు పరిపాలన పరమైన అనుమతులు ఇటీవల జారీ చేసింది. తాజాగా ఈ రోజు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

భూముల రీ సర్వేను తక్షణమే చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్‌లో సమస్యలు తెలత్తకుండా పకడ్భందీగా సర్వే చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మండలాలను యూనిట్‌గా తీసుకుని మూడు విడతల్లో సర్వేను పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో సర్వే అసిస్టెంట్, వీఆర్‌వోలను ఈ విషయంలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రికార్డును డిజిటలైజేషన్‌ చేసి నాలుగు చోట్ల భద్రపరచాలని జగన్‌ నిర్ణయించారు. రికార్డులు ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు.

ప్రస్తుతం అనేక భూ సమస్యలు గ్రామ స్థాయిలో ఉన్నాయి. ఒకరు అనుభవంలో ఉన్న భూమి రికార్డులు మరోకరి వద్ద ఉన్నాయి. సరిహద్దు వివాదాలు ఇక షరా మూమూలే. సర్వే సమయంలో వివాదాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో సదరు భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. డిప్యూటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ మొబైల్‌ కోర్టులు పని చేయనున్నాయి. సమస్య ఉన్నచోటకే మొబైల్‌ కోర్టులు వెళ్లనున్నాయి. సర్వేకు సంబంధించి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. సరిహద్దు రాళ్లు కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది. భూ యజమానులకు రూపాయి ఖర్చు లేకుండా వారి సమస్యను తీర్చాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

Read Also : రేపో.. మాపో బాబుకు ఆ ముప్పు తప్పేలా లేదు..!

భవిష్యత్‌లో భూ క్రయ విక్రయాలు జరిగిన సమయంలో మ్యూటేషన్, పాస్‌బుక్కుల జారీ ప్రక్రియను కూడా సరళతరం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భూముల రిజిస్ట్రేషన్‌ జరిగిన సమయంలో ఆటోమ్యూటేషన్‌ జరిగేలా విధానంలో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా రిజిస్ట్రేషన్‌ తర్వాత సంబంధిత యజమానులు మ్యూటేషన్, పాస్‌బుక్కుల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

మొత్తం మీద ఒకట్రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే పూర్తయ్యేలా జగన్‌ సర్కార్‌ నిర్ణయాలు ద్వారా తెలుస్తోంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో భూముల రీ సర్వే ప్రధానమైంది. ఈ పని పూర్తి చేయడం ద్వారా ఏపీలోని గ్రామాల్లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమై.. వివాదాలు పూర్తిగా సమసిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కూడా ఏర్పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి