iDreamPost

ఇక చాలు.. ఆపండి .. కృష్ణా వాటర్ బోర్డ్ హెచ్చరిక

ఇక చాలు.. ఆపండి .. కృష్ణా వాటర్  బోర్డ్ హెచ్చరిక

అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరిమితికి మించి ఏప్రిల్ మొదటి వారంలో కూడా నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలపై కృష్ణా బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టానికి దిగువకు నీటి మట్టాలు పడిపోగా.. నీటి వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెపధ్యంలో రానున్న వేసవిలొ తాగు నీటి అవసరాలకు కేవలం సాగర్‌పైనే ఆధారపడాల్సి ఉంటుందని, అక్కడ నిల్వ కేవలం 71 టీఎంసీ మేర మాత్రమే ఉన్నందున జాగ్రత్త పడాలని ఇరు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డ్ హెచ్చరించింది.

ఈ మేరకు కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ ఈఎన్‌సీలకు లేఖలు రాసింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులకు దిగువకు వెళ్లి నీటి వినియోగం చేయడంతో నిల్వ 830.40 అడుగులకు పడిపోయిందని.. అంటే కనీస మట్టానికంటే దిగువన 3.93 టీఎంసీ నీటిని ఇప్పటికే వినియోగించుకున్నట్టు బోర్డు లేఖలో వెల్లడించింది.

నాగార్జున సాగర్‌లో కనీస నీటి మట్టం 854 అడుగులు కాగ, ప్రాజెక్టులో ప్రస్తుతానికి ఎగువన కేవలం 71.33 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉండని.. ఈ నీటితోనే ఇరు రాష్ట్రాలు జూలై ఆఖరు వరకు నెట్టుకు రావాల్సి ఉంటుందని బోర్డ్ వెల్లడించింది. వర్షాకాలం వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరాలంటే ఈ నీటినే జాగ్రత్తగా వాడాల్సి ఉంటుందని, ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కృష్ణా బోర్డ్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలని కోరింది.

మరో వైపు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో కొన్ని చోట్ల దాళ్వ పంట కింద సాగుచేసిన వరికి రెండు మూడు వారాలు పాటు సాగు నీటికి డిమాండ్ ఉంది. కృష్ణా బోర్డ్ తాజా లేఖ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి విడుదలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠత ఆయకట్టు రైతాంగంలో నెలకొనివుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి