iDreamPost

కేసీఆర్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ .. వార్ మొదలైంది అప్పుడే?

కేసీఆర్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ .. వార్ మొదలైంది అప్పుడే?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌రరావుకు రాజ‌కీయ దురంధురుడిగా పేరు.ఎక్క‌డ నెగ్గాలో కాదు..ఎక్క‌డ త‌గ్గాలో కూడా తెలుసు. అలాగే నెగ్గ‌డం కోసం ఎంత‌టి దూర‌మైనా వెళ్తారు. అప్ప‌టివ‌ర‌కూ కాగుతున్న సెగ‌ను త‌న ఒక్క స్టేట్మెంట్ తో ఆప‌గ‌ల‌రు. అలాగే పొగ లేకుండానే నిప్పును రాజేయ‌గ‌ల‌రు. ఏం చేసినా రాష్ట్ర, పార్టీ ప్ర‌యోజ‌నాలే ఆయ‌న ఎజెండాగా ఉంటాయి. అలాంటి కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ పై కూడా ఈ స్థాయిలో యుద్ధం ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ నేత‌, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హార‌మే దీనంత‌టికీ కార‌ణంగా తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చేసిన వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి కి కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది ఆగ‌ష్టు ఒక‌టిన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ హుజూరాబాద్ నేత‌ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్ చేసింది. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్‌ కావడం ఆనాడు టీఆర్‌ఎస్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే.. కేసీఆర్ ప్ర‌క‌టించిన వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ కు ఫైలును పంప‌డంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయిన‌ట్లే అని అంద‌రూ భావించారు. కానీ.. రెండు నెల‌లు దాటినా గ‌వ‌ర్న‌ర్ ఆ ఫైలును ఓకే చేయ‌లేదు. కొన్నాళ్ల‌కు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పై తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు. ఆ ఫైలు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేరి దాదాపు నెలన్న‌ర అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా ఆలోచిస్తాం అని చెప్ప‌డం కేసీఆర్ లో అస‌హ‌నం తెప్పించింది. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి కేసీఆర్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు.

కానీ తాను పంపిన ఫైలును గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌న పెట్ట‌డ‌మే కేసీఆర్ కోపానికి కార‌ణ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక అప్ప‌టినుంచీ గ‌వ‌ర్న‌ర్ జోక్యం లేకుండానే పాల‌న‌ను సాగిస్తున్నారు కేసీఆర్. ఏ కార్య‌క్ర‌మానికీ ఆమెను ఆహ్వానించ‌డం లేదు. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించినా కేసీఆర్ వెళ్ల‌డం లేదు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ కు, కేసీఆర్ కు మ‌ధ్య న‌డుస్తున్న వార్ విష‌యం బ‌హిరంగంగానే వెలుగులోకి వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడీ వివాదం ప్ర‌ధాని వ‌ద్ద‌కు చేర‌డంతో మున్ముందు ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి