iDreamPost

ఓటిటిలో పంజా దర్శకుడి సినిమా

ఓటిటిలో పంజా దర్శకుడి సినిమా

థియేటర్ల సంగతి ఏమో కానీ బాలీవుడ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజుల ప్రవాహం కొనసాగుతోంది. నిన్న తాప్సీ హసీన్ దిల్ రుబా విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే నెలలో ప్రియదర్శన్ హౌస్ ఫుల్ 4, ఫర్హాన్ అక్తర్ తుఫాన్ కూడా రాబోతున్నాయి. వీటి మీద భారీ అంచనాలు ఉన్నాయి. హాళ్లలోనే భారీ బిజినెస్ అవకాశం ఉన్న వీటిని ఓటిటిలో తేవడం కోసం సదరు సంస్థలు భారీ పెట్టుబడులు హక్కుల కోసం కుమ్మరించాయి. ఫలితాల సంగతి ఎలా ఉన్నా కూడా వ్యూస్ మాత్రం భారీగా వస్తున్నాయి. లక్ష్మి బాంబ్, రాధే లాంటి డిజాస్టర్లు సైతం ఆయా ఓటిటిలకు రెవిన్యూ పరంగా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు మరొకటి కూడా వస్తోంది.

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా పవన్ కళ్యాణ్ పంజా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిన షీర్ షా ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. నిజానికి దీన్ని థియేటర్ కోసమే సిద్ధం చేశారు. అయితే పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పాటు లాక్ డౌన్ ఎత్తేసినా కూడా కొనసాగుతున్న ఆంక్షల వల్ల కలెక్షన్ల మీద అనుమానంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఓటిటిలకి వెళ్తున్నారు. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సైతం థియేటర్ తర్వాత కేవలం మూడు వారాల గ్యాప్ తో స్ట్రీమింగ్ చేసుకునేందుకు భారీ ఒప్పందం చేసుకుంది. షీర్ షా మీద ఇండస్ట్రీలో పెద్ద అంచనాలే ఉన్నాయి. డేట్ కన్ఫర్మ్ కాలేదు.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిలో మార్పు ఉన్నా కూడా ఇలా డిజిటల్ రిలీజులు కొనసాగడం చూస్తుంటే ఇంకో మూడు నెలలకు పైగా ఇలాంటి విడుదలలు తప్పేలా లేవు. గత ఏడాది నుంచి బంగారు బాతులా అందివచ్సిన అవకాశాలను ఓటిటిలు బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగిస్తే తమ కోసమే నిర్మించే సినిమాల్లో స్టార్లు నటించి పెద్ద దర్శకులు తీస్తారనే స్ట్రాటజీతో ఓటిటిలు పక్కా ప్లానింగ్ తో సాగుతున్నాయి. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు ఏదీ సమానం కాకపోయినా ఓటిటి దానికి ధీటైన పోటీగా ఎదుగుతున్న మాట వాస్తవం. శాటిలైట్ ఛానల్స్ ని మించిన దూకుడుని ఇవి ప్రదర్శిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి