iDreamPost

మద్యం కావాలా బాబూ..! మందు సర్టిఫికెట్‌ తీసుకురా..!

మద్యం కావాలా బాబూ..! మందు సర్టిఫికెట్‌ తీసుకురా..!

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ అయ్యాయి. వైరస్‌ను అరికట్టేందుకు సామాజిక దూరం ఒక్కటే పరిష్కారం కావడంతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ కోవలోనే భారతదేశంలోనూ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన జరిగిన జనతా కర్ఫ్యూ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ రోజు సోమవారం నాటికి తొమ్మిది రోజులువుతోంది. వచ్చే నెల 14వ తేదీ వరకు.. అంటే మరో పక్షం రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొసాగుతుంది.

ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు, మందులు అందుబాటులో ఉంచేందుకు ఆయా దుకాణాలను పరమిత సమయంలో తెరిచి ఉంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు సాధారణ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మద్యపాన ప్రియుల పట్ల లాక్‌డౌన్‌ షరాఘాతంలా మారింది. చుక్క పడంతే రోజు ప్రారంభమవని మందుబాబులు ఇప్పుడు నరకం చూస్తున్నారు. మద్యం కూడా నిత్యవసరమే అనే స్థాయిలో వారి స్థితి ఉంది. కేరళలో మద్యం లేకపోవడంతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక తెలంగాణలో కల్లుకు బానిసలైన వారు ఇప్పుడు ఆ కల్లు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మందుబాబుల పరిస్థితి దేశమంతా ఒకేలా ఉంది.

మద్యం లేకపోవడంతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంతో కేరళ ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంది. మద్యం అందిస్తామని ప్రకటించింది. అయితే దీనికి కొన్ని షరతులు పెట్టింది. మద్యం కావాలనుకునే వారు డాక్టర్ల నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలని చెప్పింది. మద్యం తాగకపోతే తాము బతకలేమనే విషయం డాక్టర్లు ధృవీకరించాలని షరతు పెట్టింది. డాక్టర్‌ ధృవీకరణ పత్రం తెస్తే మద్యం ఇస్తామని మందుబాబులకు ఉపసమనం కలింగేలా ప్రకటన చేసింది. ఊపరిపీల్చుకున్న మందుబాబులు డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు.

ఏళ్ల తరబడి కేరళలో పాక్షిక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిర్ణీత వేళల్లోనే మద్యం దుకాణాలను తెరిచి ఉంచుతారు. లైనులో గంటల తరబడి నిలబడి మద్యం కొనుగోలు చేసే పరిస్థితి అక్కడ ఉంది. ఇదే విధానాన్ని ఏపీలోనూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలు చేస్తోంది. క్రమక్రమంగా ప్రజలను మద్యానికి దూరం చేయాలనే లక్ష్యంతో మద్యం దుకాణాలను తగ్గించి. ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. కేరళలో నెలకొన్న పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో వస్తే.. ఆయా రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి