iDreamPost

తెలంగాణపై ఆప్‌ కన్ను.. కార్యాచరణ మొదలుపెట్టిన కేజ్రీవాల్‌

తెలంగాణపై ఆప్‌ కన్ను.. కార్యాచరణ మొదలుపెట్టిన కేజ్రీవాల్‌

పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి జోష్‌ మీద ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత కేజ్రీవాల్‌.. పార్టీ విస్తరణపై పూర్తిగా దృష్టి పెట్టారు. జాతీయ పార్టీగా ఆప్‌ను మార్చి, కేంద్రంలో ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేజ్రీవాల్‌ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రణాళికలు రచించి, అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఆప్‌.. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే తెలంగాణపై కూడా దృష్టి సారించారు.

వచ్చే ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై కేజ్రీవాల్‌ ఫోకస్‌ చేశారు. వచ్చే నెల 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్రకు ప్రణాళిక రచించారు. ఆప్‌ స్థానిక నేతలు ఈ పాదయాత్ర చేయబోతున్నారు. ఆప్‌ తెలంగాణ కో కన్వీనర్‌ ఇందిరా శోభన్‌ సహా పలువురు ఈ పాదయాత్రను చేయనున్నారు. పాదయాత్ర ప్రారంభం రోజు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ తెలంగాణకు రానున్నారు. ఆయన చేతుల మీదగా పాదయాత్రను ప్రారంభించాలనే స్థానిక నేతల ఆలోచన కార్యరూపం దాల్చింది. పాదయాత్ర ప్రారంభానికి ఆప్‌ అధినేత వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఆప్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ తెలియాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో వివిధ రాజకీయపార్టీల నేతలు ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఇప్పటికే పాదయాత్ర మొదలు పెట్టారు. విడతలవారీగా వారు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఆప్‌ కూడా పాదయాత్రకు సిద్ధంకావడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలూ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను కోరుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు పోటీగా అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కమ్యూనిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, కోదండరామ్‌ పార్టీ తెలంగాణ జన సమితి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తాయా..? లేదా..? చూడాలి. వీటికి తోడు ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌ టీపీ, ఆప్‌లు ఎన్నికల రంగంలోకి దిగడం ఖాయం. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాల ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి