iDreamPost

ప్రమాణ స్వీకారంలోనూ ప్రజల మనస్సులు గెలుచుకున్న కేజ్రీవాల్

ప్రమాణ స్వీకారంలోనూ ప్రజల మనస్సులు గెలుచుకున్న కేజ్రీవాల్

వరసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ అసలైన ప్రజా నాయకుడిగా మాట్లాడారు. ఎన్నికలు ముగిసినందున ఇక రాజకీయాల గొడవ వదిలేయాలని ఆయన ప్రజలను కోరారు. పార్టీ ఏదైనా, ఎవరికి ఓటేసినా ఢిల్లీ జనమంతా ఒకే కుటుంబంగా అభివృద్ధి వైపు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ అని కాకుండా అందరం ఒకే ఫ్యామిలీ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో ఆదివారం ‘ధన్యవాద్‌ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘బిడ్డపై తల్లిదండ్రులు చూపించే ప్రేమకు వెలకట్టలేం. నాపై ఢిల్లీ ప్రజలు చూపించే ప్రేమ కూడా అలాంటిదే. నా రాష్ట్ర ప్రజలపై నాకున్నది కూడా ప్రేమే. ఎన్నికల ప్రచారంలో నాపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఆరోపణలు చేశాయి. కేజ్రీవాల్‌ అన్నీ ఉచితం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రిగా.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా సంక్షేమం అందించడం తప్పా. విద్య, వైద్యం కూడా డబ్బులు తీసుకుని అందించాలా. అది ఎంత సిగ్గు చేటు’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

ఇక మంత్రులుగా ఆరుగురు ప్రమాణం చేశారు. మనీష్‌ సిసోడియా, కైలేష్‌ గెహ్లాట్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌, రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ ప్రమాణం చేశారు. కొత్త ముఖాలకు మొదటి దఫాలో చోటు దక్కలేదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానాల్లో 15 శాతం మేర మంత్రులు ఉండొచ్చు. ఈ లెక్కన ఢిల్లీలో సీఎం మినహా 10 మంది వరకూ మంత్రులు ఉండొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి