iDreamPost

ఇది కేజ్రీ క్రేజీ సవాల్‌..!

ఇది కేజ్రీ క్రేజీ సవాల్‌..!

భారతీయ జనతా పార్టీకి ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిమ్మతిరిగే సవాల్‌ విసిరారు. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించి, గెలిస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని చెప్పారు. ఢిల్లీలోని మూడు మునిసిపల్‌ కార్పొరేషన్లను (ఉత్తర, తూర్పు, దక్షిణ) విలీనం చేస్తూ కేంద్రమంత్రివర్గం మంగళవారం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎమ్సీడీ) ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల సిద్ధమవుతున్న వేళ.. కేంద్రం మూడు మునిసిపాలిటీలను విలీనం చేస్తున్నట్టు ప్రకటించడంపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఈమేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రపంచంలో మాది అతిపెద్ద పార్టీ అని బీజేపీ చెప్పుకుంటోంది. కానీ ఆప్‌ లాంటి చిన్నపార్టీని చూసి భయపడుతోంది. ఢిల్లీలోని ఎమ్సీడీలాంటి చిన్న ఎన్నికలకే వణుకుతోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు. ధైర్యముంటే ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని కేజ్రీవాల్‌ బీజేపీకి సవాల్‌ చేశారు.

‘‘బీజేపీ ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయడమంటే.. బ్రిటీష్‌వారిని భారత్‌ నుంచి పారదోలి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను కించపరిచడమే. ఓడిపోతామనే భయంతోనే వారు (బీజేపీ) మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేశారు. అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికలను కూడా రేపు వారు వాయిదా వేస్తారు ’’ అని కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చేతులు జోడించి ప్రధాని నరేంద్రమోడీని వేడుకుంటున్నానని ఆయన చెప్పారు.

మునిసిపాలిటీల విలీనం పేరుతో ఎన్నికల వాయిదా సమంజసమా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘త్వరలోనే గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలని అనుకుంటున్నందువల్ల గుజరాత్‌ ఎన్నికలను వాయిదా వేయాలని వారు(బీజేపీ) ఎన్నికల సంఘానికి లేఖ రాయగలరా?. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామని భావిస్తే.. దేశంలో తాము అధ్యక్షపాలనను తీసుకురాదలచాం కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని బీజేపీ ఎన్నికల సంఘానికి చెప్పగలదా?’’ అని కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి