iDreamPost

మంత్రికి కమీషన్‌ ఇవ్వలేక కాంట్రాక్టర్‌ సూసైడ్‌..

మంత్రికి కమీషన్‌ ఇవ్వలేక కాంట్రాక్టర్‌ సూసైడ్‌..

‘ప్రతి పనికీ మంత్రి నలభై శాతం కమీషన్‌ అడుగుతున్నారు .. ఇవ్వలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని ఉడుపిలో జరిగిన ఈ ఘటనలో ఆమంత్రి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీకి నేరుగా లేఖ రాసిన కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ సోమవారం రాత్రి ఉడుపిలోని ఓ హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు మంత్రి ఈశ్వరప్ప కారణమంటూ పాటిల్‌ రాసిన ‘డెత్‌నోట్‌’ పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది.

బెళగావిలో బీజేపీ కార్యకర్తగా ఉన్న సంతోష్‌ పాటిల్‌ ప్రధాని మోడీకి వీరాభిమాని. ఆత్మహత్యకు ముందు సంతోష్‌ పాటిల్‌ తన చావుకు ఈశ్వరప్ప కారణమంటూ స్థానిక మీడియా ప్రతినిధులకు వాట్సప్‌ సందేశాలు పంపినట్టు తెలిసింది. కొందరు మీడియా ప్రతినిధులు ఈ సమాచారం పోలీసులకు చేరవేశారు. అయితే మంగళవారం ఉదయానికల్లా సంతోష్‌ పాటిల్‌ నిర్జీవుడై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. మంత్రి ఈశ్వరప్పను తక్షణం డిస్మిస్‌ చేసి అరెస్టు చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య కూడా ఇదే డిమాండ్‌ చేశారు.

సంతోష్‌పాటిల్‌ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళూరు లో మీడియాకు చెప్పారు. ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పలు ఆధారాలను పంపిస్తున్నామన్నారు. 40 శాతం కమీషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలనూ సంతోష్‌ పాటిల్‌ సమర్పించలేదన్నారు. అలాగే, తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి ఈశ్వరప్ప ఖండించారన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయదని చెప్పారు. మరో ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ మంత్రి ఈశ్వరప్పపై కమీషన్‌ ఆరోపణలు రావడంతో అధికార బీజేపీ ఇరకాటంలో పడింది.ఈశ్వరప్పతో రాజీనామా చేయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు.బెంగళూరులో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ఎలాంటి కాంట్రాక్టు పనీ జరగలేదు. మంజూరు కూడా కాలేదు. 40 శాతం కమీషన్‌ అడిగాననడం హాస్యాస్పదం. మా శాఖ కార్యదర్శి ఇప్పటికే దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు’ అన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన సంతోష్‌పై పరువునష్టం దావా వేశానని, మార్చి 15న కోర్టు తన పిటిషన్‌ను స్వీకరించిందని మంత్రి వివరించారు. తనను బలిపశువును చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. ఈ విషయంలో అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి