iDreamPost

ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే

ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే

ప్రకాశం జిల్లా కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో కనిగిరి నియోజకవర్గం ఒకటి. కనిగిరి అంటే గుర్తొచ్చేవి కరువు, పొట్టకూటి కోసం వలసలు, ఫ్లోరోసిస్‌. ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం గుంటూరు మిర్చి యార్డు, విజయవాడలో బరువులు మోసే పనికి, హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు సిమెంట్‌ పని కోసం వెళుతున్నారు.

పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్న కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుర్రా మదుసూధన్‌ యాదవ్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ ఆ తర్వాత వైసీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న కనిగిరిలో వైసీపీకి రెండో పర్యాయంలోనే విజయం దక్కింది. 2014లో బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై ఓటమిపాలయ్యారు. స్థానికేతరుడు కావడం, అంతకుముందు ఎన్నికల్లో బాబూరావు నామినేషన్‌ చెల్లకపోవడం వల్ల వచ్చిన సానుభూతి, ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో బుర్రా విఫలం కావడం.. ఇత్యాది కారణాల వల్ల బుర్రా ఓడిపోయారు. బాబూరావు 7,107 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

వైఎస్‌ జగన్‌ ప్రభజనంలో బుర్రా మధుసూదన్‌యాదవ్‌ 2019లో ఘన విజయం సాధించారు. కనిగిరి నియోజకవర్గ చరిత్రలో ఎన్నాడూ రాని మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు. 40,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై ఘన విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ హవా, స్థానికేతరుడనే ముద్రను చెరిపేసుకునేలా కనిగిరిలో స్థిర నివాసం, ఐదేళ్లపాటు నిత్యం ప్రజల్లో ఉండడం, ఇంటింటికి నవరత్నాలు, గడపగడపకు వైఎస్సార్‌ వంటి కార్యక్రమాల ద్వారా.. ప్రతి గ్రామానికి మూడు, నాలుగుసార్లు వెళ్లడం బుర్రా ఘన విజయం సాధించేందుకు దోహదపడ్డాయి.

కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.. 2009లో సొంత నియోజకవర్గం కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కదిరి బాబూరావు నామినేషన్‌ చెల్లకపోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కదిరి సమీప బంధువు సుంకర మధుసూధనరావు కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రకు గట్టిపోటీ ఇచ్చారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో.. 2,935 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఉగ్ర బయటపడ్డారు.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌కు మద్ధతుగా కార్యకర్తల సమావేశం పెట్టిన ఎమ్మెల్యేగా ఉగ్ర రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుపొందారు. అయితే ఆ తర్వాత మిన్నుకుండిపోయారు. ౖమంత్రిగా నాడు , నేడు జిల్లా రాజకీయాలను శాసించే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉగ్రకు బేధాభిప్రాయాలున్నాయి. ఈ కారణాల వల్లనే 2014 ఎన్నికలకు ముందు ఉగ్ర వైసీపీలోకి వచ్చేందుకు యత్నాలు చేసినా ఫలించలేదు. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే 2014లో పోటీ చేసిన ఉగ్ర కేవలం 2,663 ఓట్లు పొందారు.

2014 ఎన్నికల తర్వాత నుంచి 2019 ఎన్నికల ముందు వరకూ వైసీపీలో చేరేందుకు ఉగ్రనరసింహారెడ్డి చేయని ప్రయత్నం లేదు. అయితే బాలినేనితో ఉన్న విభేధాలతోపాటు 2014లో ఆయనకు వచ్చిన ఓట్లు ఉగ్రకు ఆటంకాలుగా మారాయి. కందుకూరులో మహీధర్‌ రెడ్డి మాదిరిగా పోటీకి దూరంగా ఉన్నా.. ఉగ్ర బలంపై ఎవరి అంచనాలు వారికి ఉండేవి. కానీ పోటీ చేయడం వల్ల ఆయన బలం పై స్పష్టత వచ్చింది. 2014లో వచ్చిన 2,663 ఓట్లు ఆయనకు మైనస్‌ అయ్యాయి. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేసి 40 వేలకు పైగా ఓట్లు సంపాధించిన ప్రస్తుత మంత్రి కురసాల కన్నబాబుకు వైసీపీకి రెడ్‌ కార్పెట్‌ పరిచింది. పార్టీలో చేర్చుకుని జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. కందుకూరులో మహీధర్‌రెడ్డికి 2019లో పిలిచి టిక్కెట్‌ ఇచ్చింది.

Also Read : కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..?

2019లో పట్టుబట్టి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావుతోపోటీ పడి మరీ ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ టిక్కెట్‌ సంపాదించారు. అయితే ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో.. తనను గెలిపిస్తే వైసీపీలోకి వెళతానంటూ చెప్పి వార్తల్లో నిలిచారు.

ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతోంది. ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి దాదాపు శూన్యమే. అన్ని నియోజకవర్గాల్లో జరిగినట్లుగానే గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, పాల కేంద్రాలు, గోదాములు, ధాన్యం ఆరబెట్టుకునే కేంద్రాలు తప్పా.. ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన జరిగిన అభివృద్ధి లేకపోవడంతో ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి మూడు, నాలుగు సార్లు వెళ్లిన బుర్రా మధుసూదన్‌.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయా గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా వైసీపీ మద్ధతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఏడాది అధికవర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న సమయంలోనూ, కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడిన సమయంలోనూ ఎమ్మెల్యే వారి కంటికి కనిపించలేదు. బిల్డరైన మధుసూధన్‌ యాదవ్‌కు బెంగుళూరు, ఒంగోలులో వ్యాపారాలున్నాయి. మూడొంతుల్లో రెండు వంతుల సమయం వాటికి కేటాయిస్తున్న మధుసూదన్‌.. ఒక వంతు నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు.

మళ్లీ ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం పెట్టుకున్న ఉగ్ర నరసింహారెడ్డి.. ఈ రెండేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉన్నది చాలా తక్కువ. గుంటూరులోని తన ఆస్పత్రిలోనే ఆయన ఎక్కువ సమయం ఉంటున్నారు. అప్పుడప్పుడు కనిగిరి వచ్చినా.. పట్టణానికే పరిమితం అవుతున్నారు. ప్రకృతి విపత్తులతోపాటు స్థానిక సమస్యలు అనేకం ఉన్నా.. వాటి పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునే అవకాశం ఉన్నా.. ఉగ్ర వాటిని అందిపుచ్చుకోవడం లేదు. ఇది ఎమ్మెల్యే మధుకు కలసివస్తోంది. ఎమ్మెల్యే మాదిరిగానే.. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉగ్ర కూడా ప్రజల్లోకి చురుకుగా వెళ్లకపోవడం.. మధుసూదన్‌ యాదవ్‌కు కొండంత ఊరట లభిస్తోంది. ఉగ్ర నరసింహారెడ్డి దూకుడుగా ప్రజల్లోకి వెళితే.. ఎమ్మెల్యే మధుపై ఒత్తిడి భారీగా ఉండేది.

కనిగిరి నియోజకవర్గంలో సమస్యలకు కొదవేలేదు. తాగు, సాగునీటి సమస్యలున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కనిగిరిలోని కొన్ని మండలాలకే ప్రయోజనం. ఇతర మండలాలకు కూడా నీళ్లు వెళ్లేలా.. వెలిగొండ నీటిని చెరువులకు నింపేందుకు అవకాశం ఉంది. దీని వల్ల గ్రామాల్లో తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ఎమ్మెల్యే బుర్రా పని చేయాల్సి ఉంది. బృహత్తర బాధ్యతలు మోస్తున్న బుర్రా మధుసూదన్‌యాదవ్‌.. మిగిలిన మూడేళ్లలో ఆ బాధ్యతలను ఎంత మేరకు నిర్వర్తిస్తారో చూడాలి.

Also Read : తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి