iDreamPost

జగన్‌ నమ్మితే అంతే.. అందుకు కనిగిరి ఎమ్మెల్యేనే నిదర్శనం..

జగన్‌ నమ్మితే అంతే.. అందుకు కనిగిరి ఎమ్మెల్యేనే నిదర్శనం..

ఒక నాయకుడు వైఎస్ జగన్ వద్ద విశ్వాసం సంపాదిస్తే.. సదరు నేత రాజకీయజీవితం ఎలా ఉంటుందో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ రాజకీయ పయనం పరిశీలిస్తే అర్థమవుతుంది. తాజాగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటిసారి ఎమ్మెల్యే, పట్టుమని పదేళ్లు రాజకీయ అనుభవం లేని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌పై ఇంత పెద్ద బాధ్యతను జగన్‌ పెట్టడానికి కారణం.. అతనిపై ఉన్న విశ్వాసమేనని తెలుస్తోంది.

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ స్వస్థలం కనిరిగి పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గం. 2014 ఎన్నికలకు ముందు.. కనిగిరి టిక్కెట్‌ దక్కించుకున్నారు. నాన్‌లోకల్‌ కావడం, అంతకు ముందు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు నామినేషన్‌ చెల్లకపోవడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల.. బుర్రా 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసిన బుర్రా.. 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొనసాగించిన బుర్రా.. నియోజకవర్గంలో దందాలు, అక్రమాలకు తావు ఇవ్వలేదు. ఇదే జగన్‌ వద్ద ఆయనకు మంచిపేరును తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే బుర్రాను ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్‌ బోర్టు సభ్యుడిగా సీఎం జగన్‌ నియమించారు.

ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్టు సభ్యుడుగా ఉన్న బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు.. తాజాగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషం. జిల్లాల పునర్‌విభజన తర్వాత ప్రకాశంలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే భౌగోళికంగా ప్రకాశం జిల్లా పెద్దది. పైగా ఈ జిల్లా వైసీపీకి కంచుకోట లాంటిది. 8 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల వైసీపీ అధికారంలో ఉంది. కొండపి మినహా, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ సహా సీనియర్‌ నేత అన్నా రాంబాబు, తొలిసారి ఎమ్మెల్యేలు అయిన మద్దిశెట్టి వేణుగోపాల్, నాగార్జున రెడ్డి, సుధాకర్‌బాబులను సమన్వయం చేసుకుంటూ బుర్రా పని చేయాల్సి ఉంటుంది. బుర్రా పనితీరు ఎలా ఉంటుందో 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి