iDreamPost

తండ్రి బాటలోనే కొడుకు… పెద్ద మనసు చాటుకున్న KTR కుమారుడు హిమాన్షు!

  • Published Jul 11, 2023 | 8:58 AMUpdated Jul 11, 2023 | 8:58 AM
  • Published Jul 11, 2023 | 8:58 AMUpdated Jul 11, 2023 | 8:58 AM
తండ్రి బాటలోనే కొడుకు… పెద్ద మనసు చాటుకున్న KTR కుమారుడు హిమాన్షు!

తండ్రి బాటలోనే నడిచి.. మంచి పనులు చేసి.. పలువురు చేత ప్రశంసలు పొందే కుమారుడు ఉండే నిజంగా అదృష్టం అనే చెప్పవచ్చు. అలాంటి కొడుకును చూసి తండ్రి మనసు పుత్రోత్సాహంతో పొంగి పోతుంది. ప్రస్తుతం తెలంగాణ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ ఇలాంటి ఆనందాన్నే పొందుతున్నారు. కుమారుడు ఇంత చిన్న వయసులోనే తన వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సేవా కార్యక్రమాలు చేపడుతుండటం చూసి ఆయన గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. కేటీఆర్‌ తన నానమ్మ కల నెరవేర్చడం కోసం ఆమె స్వగ్రామ కోనాపూర్‌లో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అంతేకాక గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం మరో 7.5 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఇక ఇంద్రభవనాన్ని తలదన్నే రీతిలో నిర్మితమైన ప్రభుత్వ పాఠశాల భవనం ఫొటోలను కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ.. ఆయనకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాక.. ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి పని చేస్తున్నావ్‌ అంటూ ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ కొడుకు హిమాన్షు.. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో ముందు ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా హిమాన్షు.. మరో సారి తన పెద్ద మనసు చాటుకున్నాడు ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని.. కోటి రూపాయలు ఖర్చు చేసి.. దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌ తరహాలో తీర్చి దిద్దారు. బడి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరలవుతున్నాయి. మరి ఈ స్కూల్‌ ఎక్కడ ఉంది అంటే..

హిమాన్షు.. ఖాజాగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివే సమయంలో.. గచ్చిబౌలి కేవశనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఓ సారి సందర్శించాడు. ఆ స్కూల్‌లో చదువుతోన్న విద్యార్థులతో మాట్లాడాడు. తరచుగా ఆ పాఠశాలకు వెళ్లి అక్కడి స్టూడెంట్స్‌తో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెలుసుకునేవాడు. ఈ క్రమంలో ఆ అవసాన దశలో ఉన్న ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని భావించిన హిమాన్షు ఆ బడిని దత్తత తీసుకున్నాడు. దాని అభివృద్ధి కోసం రూ. 80 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు వెచ్చించాడు. అన్ని అత్యాధునిక సౌకర్యాలతో.. కార్పొరేట్‌ భవనాన్ని తలదన్నే రీతిలో దాన్ని అభివృద్ధి చేశారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాముల్‌ యాదవ్‌ తెలిపారు. హిమాన్షు స్కూల్‌ కోసం కేటాయించిన నిధులతో.. బడిలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, టాయిలెట్లు, డైనింగ్‌ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రూపు రేఖలు మారిన స్కూల్‌ తాజా ఫొటోలను హిమాన్షు తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. హిమాన్షు బర్త్‌డే సందర్భంగా జూలై 12 అనగా బుధవారం నాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఇక హిమాన్షు చేసిన మంచి పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ మెచ్చుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి