iDreamPost

పార్టీకి అధ్యక్షుడు – సొంత మండలాన్ని కాపాడుకోలేకపోయారు..

పార్టీకి అధ్యక్షుడు – సొంత మండలాన్ని కాపాడుకోలేకపోయారు..

ఆయన ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. సీనియర్‌ రాజకీయ నాయకుడు. పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి తన సొంత ప్రాంతంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరువు పోగొట్టుకున్నారు. తన సొంత మండలంలో కనీసం పోటీకి అభ్యర్థులు నిలబెట్టలేక చతికిలబడ్డారు. ఆయనెవరో కాదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపించకలేక కళా వెంకట్రావు దాదాపుగా ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత మండలమైన రేగిడిలో పోలింగ్‌ జరగకుండానే ఓటమిని చవిచూశారు. ఆ మండలంలోని ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ నుంచి ఒకరు కూడా నామినేషన్‌ వేయలేదు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల పరిషత్‌ను సైతం గెలవబోతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి సొంత మండలంలోనే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో ఎలా ఉందో అంచనా వేయొచ్చు.

కళా వెంకటరావు సొంత నియోజకవర్గం రాజాం. అక్కడ రిజర్వ్‌డ్‌ కావడంతో పక్కనే ఉన్న ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ రాజాంలోని అన్ని మండలాల్లో (రాజాం, వంగర, శంతకవిటి, రేగిడి ఆముదాలవలస)గతంలో ఆయనకు మంచి పట్టు ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కళా వెంకటరావు హవానే నడిచేది. ఆయన నిర్ణయించిన అభ్యర్థులే పోటీలో నిలబడేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొండ్రు మురళి సైతం ప్రస్తుతం స్థబ్దుగా ఉంటున్నారు. పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.

ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు అందడం ఒక ఎత్తయితే.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నాయకులు, కార్యకర్తలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు సైతం సైలెంట్‌ అయిపోయారు. దీంతో చాలా చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి