iDreamPost

Jiyo Parsi : పార్శీలకు సర్కారు వారి ఆన్లైన్ డేటింగ్ ఆఫర్ , పెళ్ళి చేసుకోండి, మీ జనాభాను పెంచుకోండి,

Jiyo Parsi : పార్శీలకు సర్కారు వారి ఆన్లైన్ డేటింగ్ ఆఫర్ , పెళ్ళి చేసుకోండి, మీ జనాభాను పెంచుకోండి,

పెళ్ళొద్దు బాబోయ్ అంటున్న పార్శీలను ఎలాగైనా ఓ ఇంటి వాళ్ళను చేసి తీరాలని, వాళ్ల జ‌నాభా పెంచాల‌ని కేంద్రం కంకణం కట్టుకుంది. “జియో పార్శీ” పేరిట ఓ స్కీం లాంచ్ చేసి పార్శీ అమ్మాయిలు, అబ్బాయిలు ఆన్లైన్ డేటింగ్ (online dating) మ్యారేజ్ కౌన్సిలింగ్ (marriage counselling) ద్వారా కలుసుకునేలా ప్రోత్సహిస్తోంది. దీని వల్ల వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్ళి చేసుకుని జనాభాను వృద్ధి చేస్తారన్నది కేంద్రం ఆలోచన. ఇంత ప్రయాస దేనికి అంటారా? అయితే రాను రాను తగ్గిపోతున్న పార్శీ కమ్యూనిటీ గణాంకాలను మీకు పరిచయం చేయాల్సిందే!

1941లో పార్శీల జనాభా లక్షా 14 వేలు. 2011 జనాభా లెక్కల ప్రకారం అది 57 వేల 264. అంటే పార్శీల సంఖ్య సగానికి సగం పడిపోయిందన్నమాట! ఈ కమ్యూనిటీలో ఏటా 800 మంది చనిపోతే పుట్టేవాళ్ళు 200 నుంచి 300 మందేనట! అందుకే జనాభాలో ఇంత తేడా. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సర్వే (NHFWS)ప్రకారం హిందువుల్లో సంతానోత్పత్తి శాతం 1.94. ముస్లింలలో ఈ శాతం 2.36 కాగా క్రిస్టియన్లలో 1.88, సిక్కుల్లో 1.61. కానీ పార్శీల సంతానోత్పత్తి శాతం ఎంతో తెలుసా? కేవలం 0.8 మాత్రమే! దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. పార్శీ యువకులు పెళ్ళంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. స్వతంత్రంగా బతకాలన్న కోరిక వల్ల కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కావచ్చు పార్శీ యూత్, మరీ ముఖ్యంగా అమ్మాయిలు పెళ్ళిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. దీంతో అమ్మాయిల సగటు పెళ్ళి వయసు 28 ఏళ్ళు, అబ్బాయిల సగటు 31 ఏళ్ళకు పెరిగింది. దీనికి తోడు పెళ్ళి వయసొచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోని ముదురు బెండకాయలు 30 శాతం ఉంటారని లెక్కలు చెబుతున్నాయి.

ఈ లెక్కలు చూసి బెంబేలెత్తిపోయిన కేంద్ర మైనారిటీ శాఖ 2013లో “జియో పార్శీ” పేరుతో ఓ పథకం ప్రారంభించింది. పార్శీలలో పెళ్ళిళ్ళు ప్రోత్సాహించి జనాభాను వృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యం. దీని కోసం ప్రభుత్వం ఏటా 4 నుంచి 5 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ స్కీం అమలు కాక ముందు పార్శీ కమ్యూనిటీలో ఏటా 200 జననాలు మాత్రమే నమోదయ్యేవని ఇప్పుడా సంఖ్య 376కు పెరిగిందని షెర్నాజ్ కామా వెల్లడించారు. షెర్నాజ్ కామా ఈ పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన సంస్థల్లో ఒకటైన పర్జోర్ ఫౌండేషన్ డైరెక్టర్. కోవిడ్ తర్వాత online dating, marriage counselling లాంటి ప్రక్రియలతో “జియో పార్శీ” పథకానికి మరింత మెరుగులు దిద్దామని ఆమె చెబుతున్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్లు పార్శీల ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకు వెళ్ళి పెళ్ళికాని అమ్మాయిలు, అబ్బాయిల ఇష్టాయిష్టాలు సేకరించి వాటిని online portalలో ఉంచుతారు. ఇందులో నుంచి తమకు నచ్చినవాళ్ళను ఎంపిక చేసుకున్నవాళ్ళకు ముఖాముఖి మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇప్పించి పెళ్ళికి ఒప్పిస్తారు. పెళ్ళే వద్దు అనే మొండి ఘటాల మెడలు వంచి పెళ్ళిళ్ళు చేయడం కూడా ఈ కౌన్సిలర్లకు వెన్నతో పెట్టిన విద్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి