iDreamPost

మావోయిస్టుల కిరాతకం : కాల్పుల్లో కొందరు.. చిత్రహింసలకు ఇంకొందరు జవాన్లు బలి

మావోయిస్టుల కిరాతకం : కాల్పుల్లో కొందరు.. చిత్రహింసలకు ఇంకొందరు జవాన్లు బలి

ఛత్తీస్గఢ్ లో శనివారం రాత్రి పక్కా ప్రణాళికతో కూంబింగ్ పార్టీని టార్గెట్ చేసిన మావోయిస్టులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. కాల్పుల్లో కొందరిని.. చిత్రహింసలు పెట్టి మరికొందరిని హతమార్చారు. నీరు, తిండి లేక ఇంకొందరు క్షతగాత్రులు ప్రాణాలు విడిచారని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందినట్లు ఆదివారం మధ్యాహ్నం వరకు ఉన్న లెక్క సాయంత్రానికి 24కు పెరిగింది. ఇంకా ఆచూకీ లేని మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఛిద్రమైన మృతదేహాలు

ఎదురుకాల్పుల్లో గల్లంతైన భద్రతా సిబ్బంది కోసం ఉదయం నుంచి అటవీప్రాంతంలో గాలిస్తున్న బలగాలను అక్కడి పరిస్థితులు దిగ్భ్రాంతికి గురిచేశాయి. జవాన్ల మృతదేహాలు, ముక్కలు ముక్కలుగా పది ఉన్న శరీర భాగాలు, ఎండిపోయిన రక్తపు మరకలతో ఆటవీప్రాంతం భీతావాహంగా కనిపించింది. మావోయిస్టుల కిరాతకానికి దర్పణం పట్టింది. ముందస్తు ప్రణాళికతో కూంబింగ్ పార్టీని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని జొన్నగూడ అటవీ ప్రాంతానికి వచ్చేలా చేసిన మావోలు.. అక్కడ వందల సంఖ్యలో మాటువేసి దాడి చేశారు.

వెనుకనున్న బలగాలు అక్కడికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపేలోపే రాకెట్ లాంచర్లు, ఏకే 47లతో భారీ నష్టం కలుగజేశారు. ఈ దాడిలో 350 మంది మావోలతోపాటు 250 మంది జన్ మిలీషియా సభ్యులు పాల్గొన్నారని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ చెప్పారు. కాల్పుల్లో కొందరు మరణించగా.. క్షతగాత్రులై నిస్సహాయంగా పడి ఉన్న మరికొందరిని మావోలు చిత్రహింసలు పెట్టి హతమార్చారు. తీవ్రంగా గాయపడిన ఓ జవానును చెయ్యి నరికి చంపేసినట్లు మృతదేహాలను చూస్తే అర్థమవుతుంది. తీవ్రంగా గాయపడిన మరికొందరు జవాన్లు గంటల తరబడి తిండి నీరు లేక డీహైడ్రేషన్ కు గురై అత్యంత దీనస్థితిలో ప్రాణాలు విడిచారు.

కాగా మావోల వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణించడం, గాయపడటం జరిగాయని అధికారులు చెబుతున్నారు. వారందరిని మావోలు మూడు ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించుకుపోయారని కూంబింగ్ బృందాల ద్వారా తెలుస్తోంది. మృతి చెందిన జవాన్లకు చెందిన ఆయుధాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు కూడా తీసుకుపోయారు.

కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఇప్పటికే 24 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు గుర్తించారు. ఇంకా పలువురి జాడ తెలియకపోవడంతో వారి కోసం కూంబింగ్ దళాలు బస్తర్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఆర్మీ హెలికాప్టర్ ద్వారా కూడా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు లభించిన మృతదేహాలను బీజాపూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి