iDreamPost

భీకర పోరు.. కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి

భీకర పోరు.. కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఎన్ కౌంటర్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సుక్మా జిల్లాలో నక్సలైట్ల సంచారం ఎక్కువ. ఇక్కడ ఎప్పుడూ జవాన్లు, నక్సలైట్ల మధ్య భీకరపోరు జరుగుతూనే ఉంటుంది. అక్కడ దండకారణ్యంలో తుపాకీ శబ్దాలు వినబడుతూనే ఉంటాయి. పోలీసులు, జవాన్లు నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు పోయాయి.. పోతూనే ఉన్నాయి. నక్సలైట్ల ఉనికి లేకుండా చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది అక్కడి పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో వారిపై నిఘా ఉంచుతోంది. అందిన రహస్య సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తారు. ఒక్కోసారి నక్సలైట్లు బిగించిన ఉచ్చులో పడి అనేక మంది జవాన్లు ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా మరోసారి ఛత్తీస్‌గఢ్‌ అడవులు తుపాకీ తూటాలతో మారుమోగాయి.

సుక్మా జిల్లాలోని తాడమెట్ల, దులేర్ అడవుల్లో జాగర్గుండ ఏరియా కమిటీకీ చెందిన నక్సలైట్లు ఉన్నారని ఇన్ ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్ మరియు డిస్ట్రిక్ట్ ఫోర్స్ సంయుక్త బృందాన్ని ఆపరేషన్‌ చేపట్టాయి. మంగళవారం ఉదయం నక్సలైట్లు ఉన్న స్థావరానికి చేరుకున్నారు. జవాన్లు రావడం చూసిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు సైతం కాల్పులకు దిగారు. 35 నిమిషాల పాటు జరిగిన భీకర పోరులో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. ఎన్ కౌంటర్ ముగియగానే.. ఆ ప్రాంతం గాలింపు చేపట్టగా.. ఇద్దరి నక్సల్స్ మృతదేహాలు లభించాయి. వీరిని సోధి దేవా, రావ దేవగా గుర్తించారు. వీరిద్దరిపై లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ జాగర్గుండ ఏరియా కమిటీ సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి