iDreamPost

నమస్కారం అంటూనే అర్థంలేని విమర్శలు

నమస్కారం అంటూనే అర్థంలేని విమర్శలు

జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగించిన ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎప్పటిలాగానే వైఎస్సార్‌ సీపీని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో సోమవారం జరిగిన సభలో రాష్ట్రంలో అన్ని పార్టీలకు, నాయకులకు నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్‌ అర్థంలేని విమర్శలతో వైఎస్సార్‌ సీపీపై దాడి చేశారు. తనకు వైఎస్సార్‌ సీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు అని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా విమర్శలు గుప్పించారు. 32 మంది భవననిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైఎస్సార్‌ సీపీయే. ఈ ప్రభుత్వం వస్తూనే కూల్చివేతలతో, అశుభంతో పాలన మొదలుపెట్టింది. వైఎస్సార్‌ సీపీ పాలనలో అడుగడుగునా విధ్వంసమే అని వ్యాఖ్యానించారు.

ఆక్రమణలు కూల్చడం అశుభం అంటారా?

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కృష్ణా కరకట్టపై అక్రమంగా లింగమనేని రమేష్‌ నిర్మించిన కట్టడాన్ని కూల్చడం పవన్‌ కల్యాణ్‌ ఒక అశుభంగా అభివర్ణించడమే విచిత్రంగా ఉందని అధికార పార్టీలు నేతలు అంటున్నారు. తమ పార్టీ మాత్రం దానిని అక్రమకట్టడంపై ఉక్కుపాదం మోపడంగానే ఇప్పటికీ పరిగణిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్పి వైఎస్సార్‌ సీపీ పాలనలో అడుగడుగునా విధ్వంసమే అని విమర్శలు గుప్పించడం కరెక్టేనా? వరదల కారణంగా ఇసుక లభ్యం కాక భవన నిర్మాణాలు ఆగిపోతే అదేదో ప్రభుత్వం తప్పిదం అన్నట్టు, నిరాధారమైన లెక్కలతో 32 మంది భవననిర్మాణ కార్మికుల ఉసురు తీసింది అని వ్యాఖ్యానించడం సమంజసమా?

ఊహాజనితమైన ఆరోపణలు..

అందరూ భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చేస్తే వైఎస్సార్‌ సీపీ.. ‘ఏపీ ప్రజలు మా బానిసలు. వారి నడ్డి విరగ్గొడతాం. న్యాయ వ్యవస్థను లెక్కచేయబోం. రోడ్లను గుంతలమయం చేస్తాం. ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఆంధ్రను 25 ఏళ్లు వెనక్కి తీసుకెళతాం’ అని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చినట్టుంది అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఈ ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ప్రతిజ్ఞచేసి పరిపాలన చేస్తున్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలు 95 శాతానికి పైగా అమలుచేసింది.ప్రజాసంక్షేమమే పరమావధిగా, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే ప్రజలను బానిసలను చేసినట్టా? వారి నడ్డి విరగ్గొట్టినట్టా? అని అధికార పార్టీ నేతలు అడుగుతున్నారు. న్యాయ వ్యవస్థను ఈ ప్రభుత్వం లెక్కచేయడం లేదని విమర్శించిన పవన్ అందుకు ఒక్క ఉదాహరణ అయినా చూపలేదు. ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా లెక్కచేయకుంటే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఊహాజనితమైన ఆరోపణలు చేశారు తప్ప నిర్మాణాత్మక సూచన ఒక్కటి కూడా పవన్ చేయలేదు.

ఆది నుంచీ అంతే..

ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్పుకొనే జనసేన అధినేతకు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్సార్ సీపీని మాత్రమే విమర్శించడం అలవాటు. పార్టీ పెట్టిన ఈ ఎనిమిదేళ్లుగా ఆ విధంగా ప్రశ్నించారు. ఇప్పుడూ అదే పంథాను కొనసాగించారని అధికారపార్టీ నేతలు తప్పు పడుతున్నారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెబుతున్న పవన్ కల్యాణ్.. అత్యధిక మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు గమనించరా? అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి