iDreamPost

అవతార్ 2 – బడ్జెట్ ఒకటే భారీ కాదు

అవతార్ 2 – బడ్జెట్ ఒకటే భారీ కాదు

ప్రపంచ మూవీ లవర్స్ లో అధిక శాతం ఎదురు చూస్తున్న సినిమాగా అవతార్ 2 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనూ భారీ వసూళ్లను ఆశిస్తున్న డిస్నీ కనీసం ఆరు నుంచి ఏడు వందల కోట్ల దాకా టార్గెట్ పెట్టుకుంది. ఇది కొంచెం ఓవర్ గా అనిపిస్తున్నా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమీ అసాధ్యం కాదన్నది ట్రేడ్ టాక్. ఈ విజువల్ గ్రాండియర్ ఫైనల్ రన్ టైం 3 గంటల 12 నిమిషాలకు లాక్ చేయడం షాక్ కలిగిస్తోంది. ఇంటర్వెల్ తో కలుపుకుంటే థియేటర్లో మూడున్నర గంటలు గడపాల్సి ఉంటుంది. ఇంటినుంచి బయలుదేరి తిరిగి వచ్చే సమయం, పార్కింగ్ టైం గట్రా కలుపుకునే ఈజీగా ఫోర్ అవర్స్ అన్న మాట.

ఇంత సుదీర్ఘ నిడివితో ఇంగ్లీష్ సినిమాలు రావడం చాలా అరుదు. ఒకప్పుడు గంటన్నరలోనే ముగిసిపోయేవి. ఇప్పుడేమో మన అర్జున్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ లాగా ఇంతేసి లెన్త్ తో వస్తున్నాయి. జేమ్స్ క్యామరూన్ మాత్రం ఈ విషయంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఏ మాత్రం విసుగు లేని ఒక అద్భుత ప్రపంచంలో ఆడియన్స్ విహరిస్తారని అలాంటప్పుడు ఎంత సమయం ఖర్చు పెట్టింది పట్టించుకోరని అంటున్నారు. నిజమే కావొచ్చు కానీ అదనంగా పావు గంట సేపు యాడ్స్ వేసే పివిఆర్ లాంటి మల్టీప్లెక్సుల్లో అవతార్ 2 ని ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రిలీజ్ 16నే కానీ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు వేయబోతున్నారు

ఏపి తెలంగాణలో ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ మరీ భీభత్సంగా లేవు కానీ ఫిల్లింగ్ అయితే ఫాస్ట్ గానే ఉన్నాయి. ఆన్ లైన్ కంటే కౌంటర్ సేల్స్ బాగుంటాయని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. వరల్డ్ వైడ్ అవతార్ 2 సేఫ్ కావాలంటే సుమారు పదహారు వేల కోట్లు వసూలు కావాలని ఒక అంచనా. అందుకే కనీసం ఒక నెల పాటు మినిమమ్ రన్ ఉండేలా డిస్నీ ప్లాన్ చేస్తోంది. అయితే సంక్రాంతి వచ్చేనాటికి అవతార్ 2 వచ్చి ఇంకా నెల రోజులు అయ్యి ఉండదు. డిస్ట్రిబ్యూటర్ షేర్ కు సంబంధించిన కండీషన్లతో పాటు పండగ దాకా సినిమాను నడిపించాలని నిర్మాణ సంస్థ పట్టుబడుతోందట. ఇంత హైప్ కి తగ్గట్టు నిలబడుతుందో లేదో త్వరలోనే తేలనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి