iDreamPost

థియేటర్లకు పొంచి ఉన్న మరో గండం

థియేటర్లకు పొంచి ఉన్న మరో గండం

కరోనా వల్ల ఇప్పటికే తెలంగాణలో థియేటర్లు మూతబడి 40 రోజులు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐదు రోజులు ఆలస్యం అంతే. పెద్ద తేడా లేదు. అసలు లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. మినహాయింపుల నుంచి సినిమా హాళ్లను పక్కన పెట్టేస్తారన్న టాక్ ఇప్పటికే ఉంది. లేదూ కాస్త ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చినా సీటు సీటు కు మధ్య గ్యాప్, ఎంట్రన్స్ దగ్గర శానిటైజెషన్ ఏర్పాట్లు లాంటి అదనపు భారాలు పడటం ఖాయం. ఇంతా చేసి జనం ఎగబడి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడీ హాళ్లు, మాల్స్ అన్ని మెయింటెనెన్స్ లేక మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాయి.

స్టాఫ్ రావడం లేదు. అందరికి జీతాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. కార్పొరేట్ సంస్థల ఆద్వర్యంలో నడిచే వాటికి ఇంటర్నల్ రెవిన్యూ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ సింగల్ స్క్రీన్ల పరిస్థితి అలా కాదు. ఉద్యోగులు అధిక శాతం వీటినే నమ్ముకుని ఏళ్ళ తరబడి ఇక్కడ పని చేస్తూ ఉంటారు. వాళ్ళను తీసేయలేరు. అలా అని ఆదాయం లేకుండా వాళ్ళకు నెలల తరబడి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. ఓ నెల లేదా మూడు నెలల తర్వాత థియేటర్లను తీసేసినా లోపలున్న డస్ట్ మొత్తం తీసేసి సీట్లన్నీ శుభ్రపరిచి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి.

ఎక్కువ సిబ్బందితో పని చేయించాల్సి వస్తుంది. పైగా ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా ప్రతిదీ ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. చెత్తా చెదారం పేరుకోలేకపోయినా రోజుల తరబడి డస్ట్ ఉండిపోతుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ లు రకరకాల రూపాల్లో పొంచి ఉంటాయి. వీటన్నింటి పట్ల జాగ్రత్తగా మసలుకోవాలి. వ్యాపార సముదాయాలదీ ఇదే పరిస్థితి కాబట్టి క్లీనింగ్ వర్కర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. వీలైనంత త్వరగా వాళ్ళను సమకూర్చుకోవడం కూడా పెద్ద సవాలే. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన తరుణంలో రాబోయే రోజుల్లో సినిమా హాళ్లకు ఇంకా చిత్ర విచిత్రమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి