iDreamPost

ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం తప్పదా?

ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం తప్పదా?

అమెరికా ఇరాన్ ల మధ్య యుద్ధ మేఘాలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులేమానిని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

అమెరికా దాడికి ప్రతీకార దాడి చేసి తీరుతామని ఇరాన్ దేశ అధ్యక్షుడు హస్సన్ రుహాని స్పష్టం చేసారు. దానికి అనుగుణంగా ఇరాక్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇర్బిల్, ఆల్-అసద్‌లో ఉన్న యూఎస్ మిలటరీ బేస్‌లపై ఈ దాడులు చేసింది. దీనిపై అమెరికా సైన్యానికి ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.

కాగా ఇరాన్ చేసిన దాడులను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధ్రువీకరించింది. అమెరికా ఎయిర్ బేస్ లపై జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఇరాక్ లో జరుగుతున్న తాజా పరిస్థితులను ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారు.తమ సైనిక స్థావరాలపై జరిగిన దాడి విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు ఇరాన్ చేసిన దాడిని ఖండిస్తూ ట్విట్టర్ లో కీలక ప్రకటన చేసారు. “అంతా బాగుంది. ఇరాక్‌లో ఉన్న రెండు సైనికక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది. ప్రపంచంలోని ఎక్కడలేనటువంటి అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది. రేపు ఉదయం నేను ఓ ప్రకటన చేస్తాను” అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఇరాన్ పై యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల మధ్య ఇప్పటికే షేర్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి.ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం వల్ల మున్ముందు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి