iDreamPost

రాష్ట్ర పెద్దల సభ రద్దుకు దేశ పెద్దల సభే అడ్డుపడుతుందా?

రాష్ట్ర పెద్దల సభ రద్దుకు దేశ పెద్దల సభే అడ్డుపడుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. రద్దు బంతి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోర్టుకు చేరింది. రేపు శుక్రవారం (జనవరి –31) నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి ఒకటి వరకు విరామం మినహా ఏప్రిల్‌ 3వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయి. మండలి బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారా..? లేదా..? అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. ఒక వేళ మండలి రద్దు తీర్మానం ప్రవేశపెడితే ఏమువుతుంది..? పార్లమెంట్‌ ఆమోదం లభిస్తుందా..? లోక్‌సభ, రాజ్యసభల్లో మండలి రద్దు తీర్మానం ఆమోదం సాధ్యమయ్యేనా..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ చేయబోతోంది..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

లోక్‌సభలో సులువు..

బడ్జెట్‌ సమావేశాల్లోగానీ మండలి రద్దు తీర్మానం ప్రవేశపెడితే.. లోక్‌సభలో సులువుగా ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో బీజేపీకి తిరుగులేని బలం ఉంది. సొంతగా 303 సీట్లు ఉన్నాయి. మిత్రపక్ష పార్టీలు (ఎన్డీఏ)తో కలుపుకుని 352 సీట్ల బలం అధికార బీజేపీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో మండలి రద్దు తీర్మానానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. అయితే బడ్జెట్‌లోనే మండలి రద్దు తీర్మానం పెట్టేందుకు బీజేపీ ఎంత వరకు సుముఖంగా ఉందన్నదే ప్రశ్న.

రాజ్యసభలో ఇదీ పరిస్థితి…

లోక్‌సభలో మాదిరిగా రాజ్యసభలో మండలి రద్దు తీర్మానం ఆమోదం ఏమంత సులువు కాదని సభలో పార్టీ బలాబలాలను బట్టి తెలుస్తోంది. 245 సీట్లు గల రాజ్యసభలో ప్రస్తుతం ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. సభలో 239 మంది సభ్యులున్నారు. మండలి తీర్మానం ఆమోదానికి సాధారణ మెజారిటీ అవసరం. అంటే 239 మంది సభ్యులకు గాను సగానికన్నా ఒక ఓటు (120) కావాల్సి ఉంటుంది. రాజ్యసభకు మొత్తం సభ్యులు హాజరైతే.. మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందాలంటే 120 సభ్యుల మద్దతు కావాలి. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం చేసే బిల్లులను ఆమోదింపజేసుకునేందుకే ఆపసోపాలు పడుతోంది. రాజకీయ చాణక్యం నడుపుతూ నెట్టుకొస్తోంది.

రాజ్యసభలో బలా బలాలు..

రాజ్యసభలో స్వతంత్రులు, నామినేటెడ్‌ సభ్యులు మినహా 31 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం 239 సభ్యులున్న రాజ్యసభలో 82 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంది. తర్వాత 46 సీట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. తృణముల్‌ కాంగ్రెస్‌కు 13 సీట్లు, ఏఐడీఎంకేకు 11, ఎస్పీ 9, బిజూ జనతాదల్‌ 7, టీఆర్‌ఎస్‌ 6, జేడీయూ 6, డీఎంకే 5, సీపీఎం 5, ఎన్సీపీ 4, ఆర్‌జేడీ 4,బీఎస్పీ 4, ఆప్‌ 3, శిరోమణి అకాళిదల్‌ 3, శివసేన 3, వైఎస్సార్‌సీపీ 2, టీడీపీ 2, పీడీపీ 2 స్థానాలు ఉన్నాయి. మరో 12 పార్టీలకు ఒక్కొక్క స్థానం చొప్పున ప్రాతినిధ్యం ఉంది. ఆరుగురు స్వతంత్రులు, నలుగురు నామినేటెడ్‌ సభ్యులు ఉన్నారు.

కలసి వచ్చే పార్టీలు ఏవి..?

బీజేపీతోపాటు కలసి వచ్చే పార్టీలపైనే మండలి రద్దు తీర్మానం ఆధారపడి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ మండలి రద్దుకు వ్యతిరేకమనే సంకేతాలున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లోనే శాసన మండళ్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీలైన ఎస్పీ (9), బీఎస్పీ (4), ఎన్సీపీ (4), శివసేన (3), ఆర్‌జేడీ 4 (సీట్లు), జేడీయూ (6), టీఆర్‌ఎస్‌(6)లు ఏపీ శాసన మండలి రద్దుకు ఎంత మేరకు మద్దతు ఇస్తాయన్నది ప్రశ్నార్థకం. ఈ పార్టీలకు రాజ్యసభలో 36 సీట్ల బలం ఉంది. ఈ ఐదు రాష్ట్రాలోనేగాక మరికొన్ని రాష్ట్రాలు శాసన మండలి ఏర్పాటుకు సుముఖంగా ఉన్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు మండలి ఏర్పాటకు ఆసక్తిగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణముల్‌ కాంగ్రెస్‌కు రాజ్యసభలో 13 సీట్లు ఉన్నాయి. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదల్‌కు 7 సీట్లు.. వెరసి తమ రాష్ట్రాల్లో మండలిని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీలకు 20 స్థానాల బలం ఉంది. ఈ పార్టీలు ఏపీ మండలి రద్దుకు మద్దతిస్తాయా..? అనే ప్రచారం మీడియా, రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

బీజేపీ పాచిక వేస్తే సాధ్యమే..

రాజ్యసభలో 239 సీట్లకుగాను బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమికి 103 సీట్లు ఉన్నాయి. మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందాలంటే 120 సీట్లు కావాలి. అంటే మరో 17 సీట్లు మాత్రమే కొరవ. కశ్మీర్‌ విభజన, సీఏఏ బిల్లుల ఆమోదంలో రాజ్యసభలో బీజేపీ గట్టెక్కింది. తాను ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదించుకునేందుకు బీజేపీ పాచికలు వేస్తోంది. ఇదే విధంగా శాసన మండలి రద్దుకు కూడా బీజేపీ అనుకుంటే సాధ్యమేనన్నది విశ్లేషకులు భావన. బడ్జెట్‌ సమావేశాల్లో ఏపీ మండలి రద్దు తీర్మానం ప్రవేశపెడతారా..? లేదా..? పెడితే ఆమోదానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుందా..? మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది..? అడ్డుకునేందుకు టీడీపీ ఎలాంటి లాబియింగ్‌ చేస్తుంది..? మరికొద్ది రోజుల్లో తేలనుంది.

మండలి రద్దు లాంటి రాష్ట్ర బిల్లు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులు సహజంగా పెద్దగా ఆసక్తి చూపరు. గతంలో అనేక బిల్లుల విషయంలో చైర్మన్ బిల్లును ప్రవేశపెట్టడం ఒకరిద్దరు మాట్లాడిన తరువాత మూజువాణి ఓటుతో ఆమోదించటం జరిగింది.

పేపర్ మీద బలాబలాల లెక్క ఎలావున్నా రాజ్యసభ ఫ్లోర్ మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవటం జరగదు. ప్రభుత్వ వ్యూహకర్తలు బిల్లు ఆమోదానికి తగుజాగర్తలు తీసుకుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి