iDreamPost

జాతీయ సంస్కృతీ మహోత్సవాలు …తెలుగు రాష్ట్రాల్లోనే తొలి అడుగు ఎందుకు ? !

జాతీయ సంస్కృతీ మహోత్సవాలు …తెలుగు రాష్ట్రాల్లోనే తొలి అడుగు ఎందుకు ? !

జాతీయ సంస్కృతీ మహోత్సవాల పేరిట బిజెపి తెలుగు రాష్ట్రాల్లో ప్రచార ఉద్యమం చేస్తోందా ?. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇదేదో అనుమానించాల్సిన విషయంగా కనిపిస్తోంది . ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగింటిని బిజెపి కైవసం చేసుకుంది . అందులో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వరుసగా 2 వ సారి అధికారాన్ని కైవసం చేసుకుని మంచి జోష్ మీద ఉంది . ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల రోజున ఎపి బిజెపి నేత జీవీఎల్ నరసింహారావు , ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు , తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తమ తదుపరి లక్ష్యం తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించడమేనని ప్రకటించారు .

తెలంగాణాలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతోంది . ఎపిలో సినీనటుడు పవన్ కల్యాణ్ తో కలిసి అధికారాన్ని పంచుకోవాలని బిజెపి ఆశపడుతోంది . కర్ణాటక, మరో చిన్నరాష్ట్రం పుదుచ్చేరి మినహా ఇప్పటివరకు దక్షిణాదిలో ఎక్కడా బిజెపి అధికార పీఠంపై కూర్చోలేదు . తమిళనాడు , కేరళల్లో ఆపార్టీ ఇప్పట్లో అధికారాన్ని సాధించే అవకాశాలు కనిపించడంలేదు . ఏపిలో కూడా ఒంటరిగా పోటీ చేసి , అధికారాన్ని సాధించడం బిజెపికి కష్టసాధ్యమే .

బిజెపియేత రాష్ట్రాలపైనే దృష్టి

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది . దీనిలో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ నినాదంతో తొలిసారిగా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని తద్వారా ప్రజల్లో ఒకరకమైన సెంటిమెంట్ ను వృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు .ఈ ఉత్సవాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి పునాది వేసే బాధ్యతను కేంద్ర పర్యాటక , సాంస్కృతికల శాఖా మంత్రి జీ కిషన్ రెడ్డి భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది .

ప్రారంభమైన నాటి నుంచి గత ఏడాది వరకు ఢిల్లీలోనే ఈ ఉత్సవాలు జరిగాయి . పశ్చిమబెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోల్కతాలో 11 వ జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు . పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది మార్చి – ఏప్రిల్ నెలల మధ్య జరగడం ఇక్కడ గమనార్హం . అక్కడ ఎంతగా కృషిచేసినా బిజెపి అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది .

ఈ ఉత్సవాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు 12 వ మహోత్సవాలకు ఆంధ్రాలోని రాజమహేంద్రవరం , తెలంగాణాలోని వరంగల్ , హైదరాబాద్ లను ఎంపిక చేశారన్న వాదన వినిపిస్తోంది . తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం, 2024లో ఏపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చి 26,27 తేదీల్లో ఏపి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం , మార్చి 29 , 30 తేదీల్లో వరంగల్ , ఏప్రిల్ 1 నుంచి 3 వ తేదీ వరకు హైదరాబాద్ లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది . రానున్న రోజుల్లో పొరుగున ఉన్న తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్సవాలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేము .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి