iDreamPost

రస్సెల్ నుంచి సూర్య వరకు.. వద్దనుకున్నోళ్లే స్టార్స్ అయ్యారు! ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

  • Published Apr 13, 2024 | 9:01 PMUpdated Apr 13, 2024 | 9:01 PM

టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్​గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్​గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 13, 2024 | 9:01 PMUpdated Apr 13, 2024 | 9:01 PM
రస్సెల్ నుంచి సూర్య వరకు.. వద్దనుకున్నోళ్లే స్టార్స్ అయ్యారు! ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్​లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. ఒక సీజన్​లో ఫ్లాప్ అయితే పక్కన బెట్టేస్తాయి. ఒక్కోసారి క్లిక్ అయిన వారిని కూడా వద్దనుకుంటాయి. తమకు నమ్మకం లేని వారిని ఆక్షన్​లో రిలీజ్ చేసేస్తాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్​గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫ్రాంచైజీతో లాంగ్ టైమ్ జర్నీ చేయాలనుకునే ప్లేయర్లు మధ్యలో ఇలా హ్యాండిస్తే చాలా బాధపడతారు. తమను తీసేశారనే కసిని నెక్స్ట్ టోర్నీలో చూపిస్తారు. అలా రస్సెల్ నుంచి సూర్యకుమార్ వరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు వద్దనుకున్న ప్లేయర్లు ఇతర జట్లలోకి చేరాక మ్యాచ్ విన్నర్​లుగా మారి కీలకపాత్ర పోషించడం చూస్తున్నాం. మరి.. ఒక టీమ్​లో క్లిక్ అయినా వదిలివేయబడిన ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ వరల్డ్ క్రికెట్​లో టీ20ల్లో బెస్ట్ బ్యాటర్​గా కొనసాగుతున్న ఆటగాడు. కానీ ఒకప్పుడు అతడి గురించి ఎవరికీ తెలియదు. ముంబై ఇండియన్స్​కు ఆడుతూ టీమ్ విజయాల్లో కీలకంగా మారిన మిస్టర్ 360.. తొలుత కోల్​కతా నైట్ రైడర్స్​కు సెలక్ట్ అయ్యాడు. 2012లో అతడ్ని ఒక్క మ్యాచ్​లో మాత్రమే ఆడించింది కేకేఆర్. అందులోనూ అతడు డకౌట్ అయ్యాడు. దీంతో అతడ్ని వదిలేసింది. సూర్యలోని టాలెంట్​ను గుర్తించి ప్రోత్సహించడంలో ఆ జట్టు ఫెయిలైంది. ఆ తర్వాత ముంబైకి మారాడు సూర్య. ఆ టీమ్ తరఫున అదరగొడుతూ ఏకంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఈ స్థాయికి ఎదిగాడు.

ఆండ్రీ రస్సెల్

స్టార్ ఆల్​రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంటే వెంటనే అందరికీ కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ గుర్తుకొస్తుంది. అంతగా ఆ జట్టుతో అతడు మమేకం అయ్యాడు. ఓటమి ఖాయం అనుకున్న ఎన్నో మ్యాచుల్లో కేకేఆర్​ను సింగిల్ హ్యాండ్​తో బయటపడేశాడు రస్సెల్. ఈ సీజన్​లో అతడు మంచి ఊపు మీద ఉన్నాడు. అయితే ఈ విండీస్ వీరుడ్ని ఒకప్పుడు వద్దనుకుంది ఢిల్లీ డేర్​డెవిల్స్. 2012-13 సీజన్​లో ఆడించి తప్పించింది. ఢిల్లీ వద్దనుకున్న రస్సెల్ కేకేఆర్​కు వరంగా మారాడు.

యుజ్వేంద్ర చాహల్

స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూలు అందిస్తూ రాజస్థాన్​కు తురుపుముక్కగా మారాడు. అయితే అతడు ఇంతకుముందు రెండు టీమ్స్ మారాడు. 2011లో ముంబై ఇండియన్స్​కు సెలక్ట్ అయిన ఈ లెగ్ స్పిన్నర్ కేవలం ఒకే మ్యాచ్​ ఆడాడు. రెండేళ్ల పాటు అదే జట్టుతో జర్నీ చేశాక.. 2014లో ఆర్సీబీకి షిఫ్ట్ అయ్యాడు. ఆ జట్టు తరఫున 114 మ్యాచ్​లు ఆడాడు. బెంగళూరుకు సుదీర్ఘ కాలం సేవలు అందించిన చాహల్​ను 2022లో జరిగిన ఆక్షన్​లో ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకోలేదు. అతడ్ని రాజస్థాన్ రూ.6.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.

ఏబీ డివిలియర్స్

ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ప్లేయర్స్​లో ఒకడిగా డివిలియర్స్​ను చెప్పొచ్చు. అయితే ఏబీడీ అంటే అందరూ ఆర్సీబీ ప్లేయర్​గానే చూస్తారు. ఆ టీమ్​కే మాత్రమే అతడు ఆడాడని అనుకుంటారు. కానీ మొదట డివిలియర్స్ ఆడింది ఢిల్లీ డేర్​డెవిల్స్​ టీమ్​కు అనేది చాలా మందికి తెలియదు. తొలి మూడు సీజన్లు ఆ జట్టుకే ఆడాడు. 2011 నుంచి ఆర్సీబీకి ఆడటం స్టార్ట్ చేశాడు ఏబీడీ.

డేవిడ్ వార్నర్

ఐపీఎల్​లో వార్నర్ పేరు చెబితే ఠక్కున సన్​రైజర్స్ హైదరాబాద్ గుర్తుకొస్తుంది. 2016లో ఎస్ఆర్​హెచ్​కు కప్ అందించాడతను. తెలుగువాళ్లకు ఎంతో దగ్గరైన అతడ్ని ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుస్తుంటారు. అయితే సన్​రైజర్స్​ను వీడి రెండేళ్ల కింద ఢిల్లీ క్యాపిటల్స్​కు వెళ్లిపోయాడు. ఢిల్లీ టీమ్​తో అతడిది సుదీర్ఘ ప్రయాణం. ఐపీఎల్ డెబ్యూ కూడా అదే జట్టు తరఫున ఇచ్చాడు. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీకే ఆడాడు. ఎస్​ఆర్​హెచ్​ రిటైన్ చేసుకోకపోవడంతో మళ్లీ అదే టీమ్​కు వెళ్లిపోయాడు.

శుబ్​మన్ గిల్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్​గా ఉన్న శుబ్​మన్ గిల్ తన ఐపీఎల్ జర్నీని కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​తో స్టార్ట్ చేశాడు. 2018 నుంచి 2022 వరకు అదే జట్టుకు ఆడాడు. రెండేళ్ల కింద జీటీ అతడ్ని ఆక్షన్​లో దక్కించుకుంది. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో గిల్​కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

రషీద్ ఖాన్

సన్​రైజర్స్ హైదరాబాద్ టీమ్​తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఆఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. 2018 నుంచి 2021 వరకు అదే జట్టుకు ఆడాడు. గత మూడేళ్ల నుంచి గుజరాత్ టైటాన్స్​కు ఆడుతున్నాడు.

కేఎల్ రాహుల్

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్లు అవుతోంది. ఈ గ్యాప్​లో అతడు నాలుగు టీమ్స్​ మారాడు. తొలుత ఆర్సీబీకి ఆడిన రాహుల్.. ఆ తర్వాత సన్​రైజర్స్​కు షిఫ్ట్ అయ్యాడు. అనంతరం 2018లో పంజాబ్ కింగ్స్​ మారి నాలుగేళ్లు ఆ జట్టుతోనే ట్రావెల్ చేశాడు. అయితే 2022లో లక్నో సూపర్ జియాంట్స్​కు మారాడు. అప్పటి నుంచి ఆ టీమ్​ను కెప్టెన్​గా ముందుండి లీడ్ చేస్తున్నాడు రాహుల్.

జాస్ బట్లర్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ముంబై ఇండియన్స్​ తరఫున ఆడాడు. రెండేళ్ల పాటు ఆ టీమ్​కు ఆడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్​కు షిఫ్ట్ అయ్యాడు బట్లర్. అప్పటి నుంచి అదే టీమ్​కు ఆడుతున్నాడు.

గ్లెన్ మాక్స్​వెల్

ఆసీస్ ఆల్​రౌండర్ గ్లెన్ మాక్స్​వెల్ 2012లో ఐపీఎల్​లో డెబ్యూ ఇచ్చాడు. 2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. పించ్ హిట్టింగ్​తో ఎన్నో మ్యాచుల్లో ఆర్సీబీకి విజయాలు అందించాడు మాక్సీ. అయితే బెంగళూరు కంటే ముందు ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్​డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు మాక్సీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి