iDreamPost

పోలవరం రేడియల్ గేట్ల ఏర్పాటు పూర్తి -లక్ష్యం దిశగా వడివడిగా పనులు

పోలవరం రేడియల్ గేట్ల ఏర్పాటు పూర్తి  -లక్ష్యం దిశగా వడివడిగా పనులు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు లో మరో కీలక అంకం పూర్తి అయింది. ప్రధానమైన స్పిల్ వేకు రేడియల్ గేట్ల ఏర్పాటు ప్రక్రియను ఆదివారం అధికారులు ముగించారు. మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉండగా ఇంతకుముందే 42 గేట్ల ఏర్పాటు పూర్తి అయింది. మిగిలిన ఆరు రేడియల్ గేట్ల అమరిక కూడా పూర్తిచేసిన అధికారులు వాటికి హైడ్రాలిక్ సిలెండర్లు బిగించే పని చేపట్టారు. ఇది కూడా త్వరలోనే పూర్తి అవుతుందని, దీనివల్ల వచ్చే వర్షాకాలంలో వరదనీటిని పూర్తిస్థాయిలో దిగువకు మళ్లించేందుకు వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు.

15 నెలల్లోనే పూర్తి

ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్ వేకు రేడియల్ గేట్ల ఏర్పాటు ప్రక్రియను 2020 డిసెంబరు 27న ప్రారంభించారు. పనులు శరవేగంగా నిర్వహించి గత వర్షాకాలానికి ముందే 42 గేట్లను అమర్చారు. వాటికి 84 హైడ్రాలిక్ సిలెండర్లు కూడా అప్పుడే బిగించి వర్షాకాలంలో వచ్చిన వరద ప్రవాహాన్ని పాక్షికంగా దిగువకు విడుదల చేయగలిగారు. మిగిలిన ఆరు గేట్ల అమరికను ఇప్పుడు పూర్తి చేశారు. వీటికి 12 హైడ్రాలిక్ సిలెండర్లను కూడా వర్షాకాలంలోపే బిగిస్తామని అధికారులు చెప్పారు. దీనివల్ల వచ్చే వర్షాల సీజనులో వరదనీటిని పూర్తిస్థాయిలో రెగ్యులేట్ చేసి దిగువకు వదిలేందుకు వీలవుతుంది. 15 నెలల్లోనే గేట్ల ఏర్పాటు పనులు పూర్తి కావడం విశేషం. ఇప్పటికే స్పిల్ వేకు సంబంధించి 1128 మీటర్ల పొడవునా 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, గేట్లు ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సీట్ల ఏర్పాటు, కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.

నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్న సంకల్పం

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అయితే గత సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుందంటూ గొప్పలకు పోయి.. నిర్మాణంలో జాప్యానికి కారణం అయ్యారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. స్పిల్ వే నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. పునరావాస పనులు వేగం పుంజుకున్నాయి. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది పూర్తి అయితే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపడతారు. అయితే కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. దానికితోడు వివిధ కంపోనెంట్ల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే కంపోనెంట్ గా పరిగణించి , 15 రోజులకోసారి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కోరారు. నిర్దేశిత లక్ష్యం మేరకు 2023 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి