iDreamPost

భారత్ దెబ్బకు మలేషియా విల విలా…!

భారత్ దెబ్బకు మలేషియా విల విలా…!

చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అనే సామెత జన బాహుళ్యంలో ప్రచారంలో ఉంది. మలేషియా విషయంలో ఇప్పుడీ సామెతే నిజమైంది. భారత్ కు వ్యతిరేకంగా విషం కక్కిందుకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లిస్తోంది. భారత్ పామాయిల్ దిగుమతులు క్రమేణా తగ్గిపోతుండటంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. దీన్ని ఎలా సరిద్దాలో తెలియక అక్కడి నాయకత్వం తలలు పట్టుకుంటోంది..!

ఎందుకీ పరిస్థితి…

ఈ పరిస్థితికి పూర్తిగా మలేషియా స్వయంకృతాపరాధమే కారణమని చెప్పాలి. సంబంధం లేని విషయంలో వేలుపెట్టి ఇప్పుడు అనుభవిస్తోంది. కొన్ని నెలల కిందట భారత్ జమ్మూకశ్మీర్ ప్రత్యేక అధికరణను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ ఎప్పట్లానే భారత్ ను ప్రపంచదేశాల్లో చులకన చేయాలనీ చూసింది. అదే సమయంలో మలేషియా కేవలం మత ప్రాతిపదికపై .. ఆర్టికల్ 370 రద్దుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్‌జిఎ) పాకిస్థాన్, టర్కీ, చైనాలతో కలసి కశ్మీర్ సమస్యను లేవనెత్తింది. ఆ సందర్బంగా జమ్మూకశ్మీర్‌పై భారతదేశం ” దాడి చేసి ఆక్రమించిందని” మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మొహమాద్ ఆరోపిచటం సంచలనమైంది. అంతటితో ఆగని మహాతీర్ తాజాగా భారత అంతర్గత వ్యవహారాలపైనా వ్యాఖ్యలు చేయటం మొదలెట్టారు. డిసెంబర్ చివరి వారంలో కౌలాలంపూర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన పౌరసత్వ చట్టాన్ని విమర్శించారు. భారత్ లో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మొసలి కన్నీళ్లు కార్చారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది.

వాణిజ్య యుద్ధం..

మలేషియా తీరుకు నిరసనగా భారత్ నేరుగా చర్యలకు దిగకపోయినా… ఆ దేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనంతటికి కారణం వాణిజ్య యుద్ధమే. ఇందులో సంప్రదాయ యుద్ధంలో మాదిరి నేరుగా ఆయుధాలతో తలపడాల్సిన అవసరం లేదు. కానీ వాణిజ్య ప్రాధాన్యతలను సమీక్షించటం, సుంకాలు అధికం చేయటం వంటి చర్యలతో లక్షిత దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయొచ్చు. అదే జరిగితే సదరు దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి భారీగా పతనమై ప్రజలు పేదరికంలో కూరుకుపోతారు. దీనికి ఉదాహరణే అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం జరుగుతోన్న సుంకాల యుద్ధం.

నోటి దురుసుకు తగిన శాస్తి…

విదేశాల నుంచి వంటనూనెలు దిగుమతి చేసుకొనే వాటిలో The Solvent Extractors Association Of India ముఖ్యమైంది. ఇందులో 875 మంది సభ్యులున్నారు. ఇది మలేషియా ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఆదేశం నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోరాదని నిర్ణయించింది. దీంతో గత సెప్టెంబర్ లో 3 లక్షల టన్నుల ఉన్న భారత పామాయిల్ దిగుమతులు అక్టోబర్ లో 2 లక్షలకు, డిసెంబర్ లో 70 వేలకు పడిపోయాయి. దీంతో ఆ దేశంలోని పామాయిల్ రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. దీన్ని సరిదిద్దాలని మలేషియా.. భారత్ ను విజ్ఞప్తి చేస్తోంది. కానీ భారత్ అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాదు కాబట్టి మలేషియా కు ఊరట లభించేలా కనిపించటం లేదు. తాజా మలేషియా దుస్థితిని చూసినవారికి భారత మార్కెట్ బలమేంటో తెలుస్తోంది. ఇక నుంచి మనదేశంతో పెట్టుకోవాలంటే ముందూ వెనక ఆలోచించాల్సిన పరిస్థితి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి