iDreamPost

కేసీఆర్‌ ఇప్పుడైనా మేల్కొంటారా..?

కేసీఆర్‌ ఇప్పుడైనా మేల్కొంటారా..?

ఒకటి కాదు.. రెండు కాదు.. పది కాదు.. వంద కాదు.. ఏకంగా 1251 టీఎంసీల జలాలు ఈ ఏడాది వరద సీజన్‌ (జూన్‌–అక్టోబర్‌)లో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన సముద్రంలోకి వెళ్లాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఆ స్థాయిలో మళ్లీ కృష్ణాకు వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కేవలం అక్టోబర్‌ నెలలో దాదాపు 640 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా వెళ్లాయి. ఈ జలాలను ఒడిసిపట్టి కరువు అంటేనే గుర్తుకు వచ్చే రాయలసీమ తలరాతను మార్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాయలసీమ కరువు నివారణ పథకం రూపొందించారు. అయితే ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రం మోకాలడ్డుతోంది.

రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు, సంగమేశ్వర సహా పలు కొత్త లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఏపీ చేపట్టిన చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేస్తోంది. రాయలసీమ కరువు నివారణ పథకంపై రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ నేతృత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై తమ తమ వాదనలను వినిపించారు. తమకు కేటాయించిన నీటినే తాము తీసుకుంటామని సీఎం వైఎస్‌ జగన్‌ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. కేటాయించిన నీటి కన్నా ఒక్క బొట్టు ఎక్కువగా ఉపయోగించుకోబోమని ఘంటాపథంగా చెప్పారు. అయితే తెలంగాణ వైఖరి మాత్రం పూర్వ స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

885 అడుగుల ఎత్తు ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా రోజుకు దాదాపు మూడు టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేందుకు పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును శ్రీశైళంలో 848 అడుగుల వద్ద ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 866 టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్ట్‌ పూర్తి సామర్థ్యం 33 వేల క్యూసెక్కులు తోడగలదు. కానీ వరదలు వచ్చిన సమయంలో మినహా ప్రాజెక్టులో నీటి మట్టం ఎక్కువ రోజులు పూర్తి స్థాయిలో కొనసాగడం లేదు. లిఫ్ట్‌ను 830 అడుగుల వద్ద ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే 33 వేల క్యూసెక్కుల నీటిని తోడగలదని గతంలోనే అంచనాలు వేశారు. వాటిని నేడు సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసేందుకు యత్నిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. పూర్వ స్థితి నుంచే నీటిని తీసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది.

ప్రస్తుత వరద సీజన్‌లో కృష్ణా నది నుంచి సముద్రంలోకి 1251.73 టీఎంసీల జలాలు వృథాగా కలిసిపోయిన దృశ్యం రోజుల తరబడి అందరూ చూశారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నీరు వృథాగా పోవడం ఏ మాత్రం ఇష్టం ఉండకపోవచ్చు. సముద్రంలోకి పోయిన ఒక్క నీటిబొట్టును కూడా వెనక్కి తీసుకురాలేమన్న విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు. అలాంటిది 1251 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. వాటిని ఒడిసిపట్టుకోవడం వల్ల ఇరు రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయనడంలో సందేహం లేదు. పరస్పర అవగాహనతో ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పుకున్న మాటలను ఇరు రాష్ట్ర సీఎంలు ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇదే. సముద్రంలో కలిసిన కృష్ణా జలాలను చూసైనా తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాయలసీమ కరువు నివారణ పథకంపై అభ్యంతరాలు పెట్టకుండా ఉంటే.. కరువు సీమలో జల సిరులు పారించిన వారిలో ఒకరిగా నిలుస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి