iDreamPost

ఇబ్బందుల్లో బీపీవో దిగ్గజం హెచ్ఎస్బిసి!!

ఇబ్బందుల్లో బీపీవో దిగ్గజం హెచ్ఎస్బిసి!!

ప్రభుత్వాలు ఎంత సహకరించినా తమ వ్యాపార కార్యకలాపాలు లాభదాయంకంగా లేకుంటే ఏ సంస్థ కూడా ఎన్నాళ్ళో మనుగడ సాధించలేదనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో ముఖ్యమంత్రి మంత్రి వైఎస్సార్ ఎంతగానో తోడ్పడిన ఓ అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు నడవలేక కుంటుతోంది.

బీపీవో కాల్ సెంటర్ల నిర్వహణలో అంతర్జాతీయంగా పేరొందిన హెచ్ఎస్బిసి సంస్థ ఇబ్బందుల్లో పడింది. దీంతో దేశంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని లేకుండా పలు రాష్ట్రాల్లోని 24 కాల్ సెంటర్లను మూసేయాలని సంస్థ నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల నిర్వహణ పట్ల వినియోగదారుల్లో అవగాహన రావడం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగుల వినియోగంపై ప్రజలకు పరిజ్ఞానం రావడం వల్ల బీపీవో కేంద్రాల్లోని సిబ్బందికి పెద్దగా పని ఉండడం లేదు. దీంతో దేశంలోని 50 కేంద్రాల్లో 24 శాఖలను మూసేసి 14 నగరాల్లోని 26 శాఖలతో తన కార్యకలాపాలను కొనసాగించాలని సంస్థ నిర్ణయించింది. వాస్తవానికి విశాఖలో అప్పట్లో అత్యంత రద్దీ ప్రాంతం, విలువైన సిరిపురం ప్రాంతంలో ఈ హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ ఏర్పాటుకు 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. విలువైన వాణిజ్య ప్రాంతంలో దాదాపు రెండెకరాల ఉడా భూమిని సంస్థకు పదేళ్ల లీజుపై ఇచ్చారు. అందులో రెండు లక్షల చదరపు అడుగులో ఏపీఐఐసి, లార్సన్ అండ్ ట్యూబ్రో సంస్థలు అత్యాధునికమైన భవనాన్ని నిర్మించాయి. ఈ క్రమంలో ఉదాకు 22.5 శాతం వాటాను బదలాయిస్తూ ఒప్పందం జరగగా ఏటా సదరు బీపీవో సంస్థ కొంత ఆదాయాన్ని ఉడాకు చెల్లిస్తూ వచ్చేది

ఈ క్రమంలో పార్కింగ్ కు జాగా సరిపోవడం లేదని ఆ సంస్థ మళ్ళీ ప్రభుత్వాన్ని కోరగా మరికొంత స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. ఇంకా పారిశ్రామిక పాలసీలో భాగంగా నీళ్లు, విద్యుత్, పనుల్లో రాయితీ వంటి పలు ప్రోత్సాహాకాలు ఇస్తూ వచ్చారు. 
ఇలా ఆ సంస్థ మనుగడకు రాష్ట్రప్రభుత్వం శతథా సహకరిస్తూ వచ్చింది. మొదట్లో విశాఖ సెంటర్లో దాదాపు 2 వేల మంది ఉద్యోగులు పని చేస్తూ ఉండేవారు. వారి కారణంగా సిరిపురంలో పలు వాణిజ్య సంస్థలు సైతం మనుగడ సాగించేవి. అయితే కాలం మారుతుండడం, కాల్ సెంటర్ల అవసరం తగ్గడంతో తమ వ్యాపారాన్ని పునరనిర్వచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మెల్లగా సిబ్బందిని తగ్గించడం, వారిని వేరే నగరాలకు తరలించడం కూడా చేసారు. చివరకు అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మూసివేతే మార్గమని భావిస్తున్నారు.

దీంతో వడోదర, త్రివేంద్రం , రాయపూర్ సూరత్ , నాసిక్, పాట్నా, నాగపూర్, లూథియానా, లక్నో వంటి 24 శాఖలను మూసేసేందుకు సంస్థ చర్యలు ముమ్మరం చేసింది.అదే జాబితాలో విశాఖపట్నం కాల్ సెంటర్ కూడా ఉంది. ఇది దేశవ్యాప్త సమస్య కావడంతో తమ కార్యకలాపాలు లాభదాయం కాని ప్రతి నగరంలోని బీపీవోనూ మూసేసేందుకు సంస్థ నిర్ణయం తీసుకున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి