iDreamPost

త‌మ దేవుడు అనుకొని హిందువులు పూజించారు. తీరాచూస్తే విగ్రహం బుద్ధుడిది! అర్చనలు ఆపాలన్న మద్రాస్ హైకోర్టు

త‌మ దేవుడు అనుకొని హిందువులు పూజించారు. తీరాచూస్తే విగ్రహం బుద్ధుడిది!  అర్చనలు ఆపాలన్న మద్రాస్ హైకోర్టు

తమిళనాడులో వందల ఏళ్ళుగా హిందువుల పూజలు అందుకుంటున్న ఓ విగ్రహం బుద్ధుడిదని తేలింది. దీంతో ఆ ప్రదేశంలో పూజలు చేయడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సేలం జిల్లాలోని పెరియారిలో తలవెట్టి మునియప్పన్ గా పూజలందుకుంటున్న విగ్రహం నిజానికి బుద్ధుడిదని 2011లో రంగనాథన్ అనే వ్యక్తి సేలమ్ బుద్ధ ట్రస్టుతో కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది బుద్ధుల పవిత్ర ప్రదేశమని, దీన్ని జిల్లా బౌద్ధ ట్రస్టుకు అప్పగించాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన కోర్టు గుడి ప్రాంగణంలో తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని పురావస్తు శాఖను 2017లో ఆదేశించింది.

పురావస్తు శాఖ నివేదికలో ఏముంది?

పిటిషనర్ చనిపోయినా అతని వాదనే గెలిచింది. తలవెట్టి మునియప్పన్ విగ్రహం బుద్ధుడిదేనని పురావస్తు శాఖ తేల్చింది. విగ్రహానికి బుద్ధుడి మహా లక్షణాలు చాలా ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది. విగ్రహం తామర పువ్వుపై అర్థ పద్మాసనంలో ఆసీనమై ఉందని, చేతులు ధ్యానముద్రలో ఉన్నాయని, ఉంగరాల జుట్టు బుద్ధుడి జుట్టును తలపిస్తుందని, తలపైన గుండ్రటి “ఉష్ణిస” ఉందని, అలాగే చెవి తమ్మెలు పొడవుగా ఉన్నాయని పురాస్తు శాఖ వివరించింది. ఈ లక్షణాల ఆధారంగా ఇది బుద్దుడి విగ్రహమేనని నిర్ధారిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. విషయం తెలియక హిందువులు ఆ ప్రతిమకు పూజలు చేస్తూ వచ్చారని పేర్కొంది.

హైకోర్టు ఏమని ఆదేశించింది?

పురావస్తు శాఖ నివేదికను పరిశీలించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఇది బుద్ధుడి విగ్రహమేనని స్పష్టమవుతుందన్నారు. ప్రజలను ఇక్కడికి అనుమతించినా పూజలు మాత్రం చేయనివ్వరాదని రూలింగ్ ఇచ్చారు. దీని నియంత్రణను సంబంధిత బోర్డుకి అప్పజెప్పాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. జూలై 19న ఈ మేరకు జారీ అయిన ఆదేశాలు ఆగస్టు 1న బయటికొచ్చాయి.

తమిళనాడు ప్రభుత్వ వాదన ఏంటి?

అయితే ఎన్నో ఏళ్ళుగా హిందువులు పూజలు చేసినందున దీన్ని హిందూ ఆలయంగా పరిగణించి ఎండోమెంట్స్ విభాగానికి తిరిగి అప్పజెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విన్నవించుకున్నారు. ఈ విన్నపాన్ని జడ్జి తిరస్కరించారు. నిజం తెలిసిన తర్వాత కూడా దీన్ని హిందూ విగ్రహంగా భావించడం సరి కాదన్నారు. ఇది బౌద్ధ మత సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ఎండోమెంట్స్ విభాగం ఇక్కడో బోర్డు ఏర్పాటు చేసి ఇది బుద్ధుడి విగ్రహమని సూచించాలని జస్టిస్ ఆదేశించారు. ఈ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలంటూ తమిళనాడు ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర పురావస్తు శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి