iDreamPost

భార్య ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తున్నారా?.. హైకోర్టు కీలక తీర్పు!

భార్య ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తున్నారా?.. హైకోర్టు కీలక తీర్పు!

వివాహబంధంలో భార్యాభర్తల నడుమ కలహాలు సహజం. ఒకరిపై ఒకరు గొడవపడడం, అలకలు ఆ తర్వాత కలిసిపోవడం ఇవన్నీ భార్యాభర్తల మధ్య రోజు జరిగే తంతే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా భార్యభర్తల నడుమ ఆదిపత్యధోరణి, ఈగోల కారణంగా గొడవలు మొదలై విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే ఫోన్ వాడకం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భర్తకు తెలియకుండ భార్య, భార్యకు తెలియకుండా భర్త ఫోన్ కాల్ రికార్డింగ్ చేసి వాటిని సాక్ష్యాలుగా చూపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ రాష్ట్రానికి చెందిన హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు తో ఫోన్ కాల్ రికార్డింగులకు పాల్పడే వారికి షాక్ తగిలినట్లైంది. అసలేం జరిగిందంటే?

మీ భార్య లేదా భర్తతో ఫోన్ లో మాట్లాడేటపుడు ఆ ఫోన్ కాల్ ను రికార్డ్ చేస్తున్నారా? అయితే మీరిది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఫోన్ మాట్లాడేటపుడు అవతలి వ్యక్తికి తెలియకుండా రికార్డ్ చేయడం ప్రైవసీ హక్కును ఉల్లంఘించడమే అని చత్తీస్ గడ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు భార్యా భర్తలకు సంబంధించిన కేసుపై విచారణ సందర్భంగా ఆ కీలకమైన తీర్పును వెల్లడించింది. తన భార్య ఫోన్ కాల్ ను ఆమెకు తెలియకుండా భర్త రికార్డు చేయడం ఆమె గోప్యత హక్కుకు భంగం కలిగించడమే అని కోర్టు అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్దమని తెలిపింది.

చత్తీస్ గడ్ రాష్ట్రంలో భార్యాభర్తలు ఇద్దరు ఏవో గొడవల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఆ మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ మహాసముంద్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఎందుకంటే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా అతడు తన భార్య మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ తన వద్ద ఉందని, తన భార్య వ్యభిచారం చేసిందని, దాన్ని వినాలని కోర్టును కోరాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు అతడి వాదనతో ఏకీభవించింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహళ తరపు లాయర్ తన వాదనలను వినిపించాడు. ఆమె భర్త ఆమెకు తెలియకుండా ఫోన్ కాల్ రికార్డు చేశాడని, ఆమె వ్యభిచారం చేసిందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు. ఈ కారణంతో తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తప్పించుకుంటున్నాడని లాయర్ హైకోర్టుకు తెలిపాడు. వాదనల అనంతరం హైకోర్టు ఆమె భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఫోన్ కాల్ రికార్డ్ చేయడం అంటే ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని హైకోర్టు తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి