iDreamPost

ఈ రోజంతా కుండపోత వాన.. మరో మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌!

  • Published Jul 27, 2023 | 7:37 AMUpdated Jul 27, 2023 | 7:37 AM
  • Published Jul 27, 2023 | 7:37 AMUpdated Jul 27, 2023 | 7:37 AM
ఈ రోజంతా కుండపోత వాన.. మరో మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌!

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు అనగా గురవారం (జూలై 27)న రోజంతా వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. అంతేకాక తెలంగాణలో రాబోయో మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి వాతావరణశాఖ అధికారులు వెదర్ బులిటెన్ విడుదల చేశారు. దానిలోని వివరాలు ఇలా ఉన్నాయి.

నేడు వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అలానే మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాక రాష్ట్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. అలానే ఏపీలో కూడా మూడు రోజల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడమే కాక 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇక నేడు భాగ్యనగరంలో రోజంతా వర్షాలు కురుస్తాయని.. ఆకాశాం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో గత వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి