iDreamPost

మళ్ళీ విచారణకు వచ్చిన మనవాళ్ళు బ్రీఫ్డు మీ…

మళ్ళీ విచారణకు వచ్చిన మనవాళ్ళు బ్రీఫ్డు మీ…

“మనవాళ్ళు బ్రీఫుడ్ మీ..” అంటూ ఒక ప్రముఖు రాజకీయ నాయకుడి వాయిస్ క్లిప్ తో అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణ.. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 2014 లో అప్పటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావించిన పార్టీ అధినేత తన ముఖ్య అనుచరుడి ద్వారా ఎమ్మెల్సీలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఈ కేసు అప్పట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయంగా పెను దుమారం లేపింది. అనంతరం జరిగిన పరిణామాల్లో కేవలం ఈ కేసు భయంతోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అర్ధాంతరంగా రాత్రికి రాత్రికి హైదరాబాద్ నుండి అమరావతి వచ్చారని ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పించాయి.

తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం ప్రభుత్వాలు మారడం జరిగిపోయినప్పటికీ, ఓటుకు నోటు కేసు మాత్రం ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏసీబీ కోర్టులో దీనిపై కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు విచారణకు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం డ్రోన్‌ కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉండటంతో, ఆయన ను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

2015 లో తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున పోటీచేసిన అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ ను ప్రలోభపెడుతూ 50 లక్షల రూపాయల నగదుతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన తెలంగాణ ఏసీబీ మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఏసీబీ ఈ ఓటుకునోటు కేసులో నిందితుల పాత్ర, దీనివెనుక అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను చార్జిషీట్ లో పొందుపరిచారు. స్టీఫెన్‌ సన్‌ కు రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సమకూర్చారు? అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో విచారణకు రానున్న తరుణంలో త్వరలోనే ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి