iDreamPost

గడిచిన పదేళ్ళలో 900 స్కూళ్ళలో కాల్పులు!! గన్ కల్చర్ ను అడ్డుకోవడంలో అమెరికా విఫలం..

గడిచిన పదేళ్ళలో 900 స్కూళ్ళలో కాల్పులు!! గన్ కల్చర్ ను అడ్డుకోవడంలో అమెరికా విఫలం..

ఇప్పటికే గన్ కల్చర్ పేట్రేగిపోతున్న అమెరికాలో, తాజాగా టెక్సాస్ పాఠశాలలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన యావత్ అమెరికాతో పాటు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. లాటినో పట్టణానికి చెందిన రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 19మంది విద్యార్థులతో పాటు ఇద్దరు పెద్దలను కాల్చి చంపాడు ఓ దుండగుడు. ఇదంతా చేసింది కేవలం 18ఏళ్ళు కూడా నిండని సాల్వడార్ రామోస్ అనే దుండగుడు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం అతనొక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒక్కో తరగతి గది నుంచి మరో గదికి వెళ్ళి మరీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు ముందు తన అమ్మమ్మను సైతం కాల్చి చంపాడు.

గడిచిన దశాబ్ద కాలంలో ఇలాంటి ఘోరమైన సంఘటన, ఇంత భయంకరంగా ఎక్కడా జరగలేదు. 2018లో హోస్టన్ ప్రాంతంలోని ఓ హై స్కూల్లో ఓ దుండగుడు 10 మందిని కాల్చి చంపాడు . అంతకు ముందు సంవత్సరం టెక్సాస్ చర్చి వద్ద దాదాపు 24మంది ఓ దుండగుడి కాల్పు్ల్లో మృతి చెందారు. 2019లో ఒక మార్ట్ లో జరిగిన జాత్యహంకార దాడిలో 23 మంది చనిపోయారు.

అమెరికాలోని పాఠశాలల్లో విద్యార్థులే తమ తోటి వారు, టీచర్లపై ఇలాంటి కాల్పులు జరుపుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2012లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో 20ఏళ్ళ యువకుడు జరిపిన కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. అప్పటి నుంచి దాదాపు 900 స్కూళ్ళలో కాల్పులు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 27 సంఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. ఇలా గత కొన్నేళ్ళుగా గన్ కల్చర్ అమెరికన్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీన్ని నిరోధించడంలో అమెరికా పూర్తిగా విఫలమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి