iDreamPost

తెలంగాణలో Group-2 పరీక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం?

తెలంగాణలో మరోసారి గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పరీక్ష మళ్లీ వాయిదా పడనుండడంతో గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో మరోసారి గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పరీక్ష మళ్లీ వాయిదా పడనుండడంతో గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో Group-2 పరీక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం?

గ్రూప్ 2 ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మరోసారి నిరాశ కలిగించే వార్త. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేయకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకూ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీనిపై పునరాలోచన చేసిన ప్రభుత్వం గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీకి సూచించింది. కాగా అప్పుడు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణ కష్టమని భావించిన అధికారులు పరీక్షను వాయిదా వేశారు. అలాగే, ఈ పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. తాజాగా మరోసారి కూడా గ్రూప్ 2 వాయిదా పడనుంది. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మళ్లీ వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఈ క్రమంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ, ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్ల వివరాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేదా వాయిదా పడుతుందా అని నిరుద్యోగుల్లో అనుమానాలను వ్యక్తం అయ్యాయి. గ్రూప్ 2లో 783 పోస్టులకు ఐదు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే అన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ సర్కార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి