iDreamPost

అన్నదాతలకు జగన్ సర్కార్ శుభవార్త.. రైతు భరోసా పథకం పై కీలక నిర్ణయం..

అన్నదాతలకు జగన్ సర్కార్ శుభవార్త.. రైతు భరోసా పథకం పై కీలక నిర్ణయం..

ప్రస్తుత ఆపత్కాలంలోనూ జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతలకు శుభ వార్త చెప్పింది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకానికి అర్హత కలిగిన రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తుంది. వచ్చే నెల 10వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలను పరిశీలించిన తర్వాత మే 15న రైతులందరికీ ఖరీఫ్ పెట్టుబడి కోసం మొదటి విడత ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనుంది.

అన్నదాతలు ఈ పథకం నుంచి పథకం కోసం తమ పరిధిలోని వాలంటీర్లకు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు నకలును ఇస్తే సరిపోతుంది. వాలంటీర్లు గ్రామ సచివాలయం లో దరఖాస్తు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా తో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ రెండు పథకాలకు గ్రామ సచివాలయం లో నే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు ఎలాంటి సర్వీస్ చార్జి వసూలు చేయరు.

రాష్ట్రంలోని అన్నదాత లందరికీ పెట్టుబడి కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు నవరత్నాల లోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. నాలుగేళ్లలో 50 వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈ పథకాన్ని అమలు చేసింది. మొత్తం ఐదేళ్ల గాను 67, 5 0 0 రూపాయలు రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి ఏడాది 13,500 వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇందులో ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద వస్తుండగా మిగతా 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం మూడు దఫాలుగా రైతు ఖాతాలో జమ కానుంది. మొదటి దఫాగా మే 15వ తేదీన 7,500 రూపాయలు, రెండో విడత లో 4,000, సంక్రాంతి సమయంలో రెండు వేల రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు.

గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్రంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గత ఏడాది 45.60 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తాజాగా కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న డంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ పనిచేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి